హత్య చేసి.. ముక్కలు చేశారు..

విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Updated : 06 Dec 2022 15:02 IST

విశాఖలో దారుణ ఘటన
మృతురాలు శ్రీకాకుళం వాసిగా అనుమానం

మహిళ మృతదేహం దొరికింది ఈ ఇంట్లోనే..

ఈనాడు, విశాఖపట్నం, పీఎంపాలెం, న్యూస్‌టుడే: విశాఖలోని మధురవాడ వికలాంగుల కాలనీలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి... ఏమాత్రం వాసన రాకుండా ప్యాకింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీలోని శ్రద్ధావాకర్‌ హత్య కేసును తలదన్నేలా ఈ ఘటనలో నిందితులు పలు జాగ్రత్తలు తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచుల్లో కుక్కి భారీ ప్లాస్టిక్‌ డ్రమ్ములో భద్రపరచినట్లు ఆదివారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దె ఇంటి యజమాని సంబంధిత నివాసాన్ని ఖాళీ చేయించడానికి రావడంతో ఈ గుట్టు రట్టయింది. మృతదేహం పూర్తిగా కుళ్లిన తర్వాత ప్లాస్టిక్‌ సంచులను ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టాలని నిందితులు ప్రణాళిక వేసుకుని ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రుషి(40) పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రుషి స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వేలిముద్రల సేకరణ..: క్లూస్‌ టీం సభ్యులు హత్య జరిగిన నివాసంలో సోమవారం వేలిముద్రలు సేకరించారు. పోలీసులు అయిదు బృందాలుగా విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లి నిందితుడికి సంబంధించిన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. రుషికి, హత్యకు గురైన మహిళకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమైనా విభేదాలు వచ్చాయేమోనన్న కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని