ఇంటికి చేరకుండానే దూరమైపోయారు
దైవదర్శనం చేసుకుని వస్తున్న నలుగురు అయ్యప్ప స్వాములను రహదారి ప్రమాదం బలిగొనడంతో నీలిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంలో నలుగురు దుర్మరణం
నీలిపూడిలో విషాదఛాయలు
బాపట్ల జిల్లా జంపని వద్ద బోల్తాపడిన వాహనం
కృత్తివెన్ను(కృష్ణా), న్యూస్‌టుడే: దైవదర్శనం చేసుకుని వస్తున్న నలుగురు అయ్యప్ప స్వాములను రహదారి ప్రమాదం బలిగొనడంతో నీలిపూడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గంటల వ్యవధిలోనే ఇళ్లకు వస్తారని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు తమ వారి దుర్మరణ వార్త విని కుప్పకూలిపోయారు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలకు చెందిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పవన్‌కుమార్ రమేష్ పాండురంగారావు రాంబాబు
తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు
మృతుల్లో బుద్దన పవన్‌కుమార్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. తల్లిదండ్రులతో పాటు సోదరి, సోదరుని బాధ్యతలు చూసుకోవాల్సిన అతను ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తమ కష్టాలు త్వరలో తీరతాయని భావిస్తున్న సమయంలో విధి చిన్నచూపు చూసి, ఇంటికి ఆసరాగా ఉండాల్సిన వాడిని దూరం చేసిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కడవరకూ అండగా ఉండాల్సిన భర్త తనను ఒంటరిని చేసి అర్ధంతరంగా దూరం కావడాన్ని బాడిత రమేష్ భార్య జీర్ణించుకోలేక పోతోంది.
సోదరుడి కళ్లెదుటే
బొలిశెట్టి పాండురంగారావుతో పాటు అతని సోదరుడు చంటి కూడా అదే వాహనంలో ఉన్నారు. తన కళ్లెదుటే అన్న పాండురంగారావు విగతజీవిగా మారడాన్ని చూసి చంటి తట్టుకోలేకపోతున్నాడు. ఈ ప్రమాదంలో అతను కూడా గాయపడ్డాడు. పాండురంగారావుకు పాప, బాబు ఉన్నారు.
* కౌలురైతు పాశం రాంబాబు ప్రమాదంలో మృత్యువాతపడడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహాలయ్యాయి.
పలువురి పరామర్శ
మంత్రి జోగి రమేష్, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్, పెడన నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్, ఎంపీపీ ప్రసాద్, ఆయా పక్షాలకు చెందిన స్థానిక నాయకులు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను సంతాపం తెలిపారు.
మలుపు... మంచు ప్రాణాలు తీశాయా?
వేమూరు, న్యూస్‌టుడే: వారంతా అయిదు రోజుల పాటు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. శబరిమల వెళ్లి అయ్యప్ప దీక్ష ముగించుకుని వచ్చి శబరి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి చేరి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మృత్యువు మంచు, మూల మలుపు రూపంలో వచ్చి నలుగురిని కబళించింది.
ప్రయాణం మొదలైన గంటలోపే.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం, నూలిపూడికి చెందిన 23మంది అయ్యప్ప దీక్షాధారులు శబరిమల వెళ్లేందుకు తమ గ్రామం నుంచి తెనాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వాహనాన్నే తిరుగు ప్రయాణానికి కూడా మాట్లాడుకున్నారు. సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా అలముకొని ఉండడం, జంపని చివుకులవారి చెరువు వద్ద మూలమలుపును గుర్తించలేక చోదకుడు వాహనాన్ని కుడివైపునకు తిప్పే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పోలీసులు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డును ఢీకొని బోల్తాపడింది. ప్రయాణం మొదలుపెట్టిన గంట వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పైకప్పు లేకపోవడమూ కారణమా?.. తక్కువ ఛార్జీతో ప్రయాణం పూర్తవుతుందని వారంతా బొలేరో రవాణా వాహనం ఎక్కారు. 23మందికి కూర్చునే అవకాశం లేక నిలబడిపోయారు. వాహనం బోల్తాపడడంతో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా కింద పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఉదయం 7.30గంటల సమయంలో ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు 108 వాహనానికి సమాచారం ఇచ్చి ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదాలకు నిలయం.. తెనాలి-వెల్లటూరు మార్గంలో జంపని చివుకులవారి చెరువు వద్ద మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ ఏడాదికి నాలుగైదు ప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో పోలీసు హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పొగమంచు కారణంగా చోదకుడు దాన్ని గుర్తించలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Politics News
Andhra News: మూడేళ్లలో జగన్ సర్కార్ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన
-
India News
Supreme Court: ఎట్టకేలకు కదిలిన కేంద్రం..! ఆ అయిదుగురి నియామకాలకు ఆమోదం