భగ్గుమన్న విభేదాల నిప్పు

నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Updated : 07 Dec 2022 04:11 IST

యువకుడిపై హత్యాయత్నం
కోళ్లబావాపురంలో పికెటింగ్‌

పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన ఇంటిని పరిశీలిస్తున్న ఎస్సై

నందికొట్కూరు, నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోళ్లబావాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్థర్‌, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల వారు పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల గ్రామానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను మరోవర్గం వారు నిలదీశారు. వివాదం ముదిరి రెండువర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఠాణాలో కేసులు పెట్టుకున్నారు. ఇది సద్దుమణగక ముందే తాజాగా గ్రామంలో ఓ యువకుడిపై హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భాస్కర్‌ కుమారుడు నాగరాజు అధికార పార్టీకి చెందిన సభ్యుడైనా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్నారు. ఆయన భార్య తన పిల్లలతో పుట్టినిల్లు అలంపూరుకు వెళ్లారు. సోమవారం రాత్రి నాగరాజు ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు బయట గడియపెట్టి కిటికీలోంచి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టి పరారయ్యారు. మంటలు చెలరేగి ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ వాసనకు మేల్కొన్న ఆయన భయంతో కేకలు పెట్టాడు. చుట్ట్టుపక్కలవారు వచ్చి తలుపు తీయడంతో బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఘటన తీరును పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.   గ్రామంలో ఎస్సై ఓబులేసు ఆధ్వర్యంలో పోలీసులు పికెటింగ్‌ నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు