ఆరిన ఇంటి వెలుగులు

రహదారి ప్రమాదాలు మూడు కుటుంబాల్లో చీకట్లు నింపాయి.  జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు.  

Updated : 07 Dec 2022 04:59 IST

రహదారి ప్రమాదాల్లో ముగ్గురి మృతి

రహదారి ప్రమాదాలు మూడు కుటుంబాల్లో చీకట్లు నింపాయి.  జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు.  


కారు ఢీకొని..

సాంబమూర్తి (పాతచిత్రం)

ఉంగుటూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై బాదంపూడి వైజంక్షన్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన కథనం మేరకు...తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటకి చెందిన దాసరి సాంబమూర్తి (58) నిడమర్రు మండలం పత్తేపురంలో పాత సంచుల దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం పత్తేపురం నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. బాదంపూడి వైజంక్షన్‌ వద్ద మలుపు తిరుగుతుండగా ఏలూరు వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సాంబమూర్తిని 108 వాహనంలో తొలుత తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి అక్కడ నుంచి తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో సోమవారం రాత్రి మృతి చెందారు. మృతుడికి దివ్యాంగురాలైన భార్య వెంకటరమణ, కుమారుడు శివ ప్రసాద్‌ ఉన్నారు.


తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వచ్చి..

సోములు (పాతచిత్రం)

కైకరం (ఉంగుటూరు), న్యూస్‌టుడే: కైకరంలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మృత్యువు ట్రక్కు ఆటో రూపంలో కబళించింది. బాధితుల కథనం మేరకు...కైకరం శివారు బ్రహ్మానందపురం గ్రామానికి చెందిన చెంసాని సోములు (63) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కైకరంలో షష్ఠి ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చారు. అనంతరం తిరిగి కాలినడకన ఇంటికి వెళ్తుండగా స్థానిక పంచాయతీ చెరువు సమీపంలో ట్రక్కు ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సోములును 108 వాహనంలో తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందారు. సోములుకు భార్య రమణ, వివాహాలైన ముగ్గురు కుమారులు ఏసుపాదం, జయరాజు, విజయరాజు ఉన్నారు.  


కుమారుడి మృతి.. తండ్రికి తీవ్రగాయాలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా, తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన గంటా వెంకన్న, అతడి కుమారుడు తేజ(14) ద్విచక్ర వాహనంపై మంగళవారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం వస్తుండగా గురవాయిగూడెంలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి పడిపోయారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ వారి మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.  చికిత్స నిమిత్తం తొలుత జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తేజ మృతిచెందాడు. వెంకన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు