వెంటాడిన మృత్యువు

ఆ కుటుంబంలో తండ్రి, కుమారుడిని మృత్యువు వెంటాడింది.

Updated : 08 Dec 2022 05:09 IST

ఒకే ప్రాంతంలో నాడు కుమారుడు.. నేడు తండ్రి దుర్మరణం

చల్లపల్లి వెంకటయ్య (పాతచిత్రం)

సీతారామపురం, న్యూస్‌టుడే : ఆ కుటుంబంలో తండ్రి, కుమారుడిని మృత్యువు వెంటాడింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలోకుటుంబ పెద్దదిక్కు మృతిచెందగా విషాదం నెలకొంది. ఏడేళ్ల క్రితం అక్కడే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో గ్రామస్థులను కలచివేసింది.. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..  సీతారామపురం మండలం ఏనుగులవారి కొట్టాలులో చల్లపల్లి వెంకటయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కష్టపడి బిడ్డలను చదివించారు. కుమారుడు బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించడతో ఇక కష్టాలు దూరమయ్యాయని భావించారు. ఆరునెలలు గడవక ముందే 2015లో వినాయక చవితి రోజు అప్పటిదాకా స్నేహితులతో గడిపిన కుమారుడు చల్లపల్లి వెంకట రవీంద్రప్రసాద్‌ సీతారామపురానికి ద్విచక్రవాహనంపై సాయంత్రం వస్తుండగా తోటకాలనీకి సమీపంలో కారు ఢీకొనడంతో మృతిచెందాడు. తమ కష్టాలు కడతేరుస్తాడనుకున్న కుమారుడే తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం తండ్రి వెంకటయ్య(62) సీతారామపురంలో నీటిక్యాన్లను తీసుకెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగెళుతున్న క్రమంలో తోటకాలనీ సమీపంలో పిడతల వెంకటేష్‌ ద్విచక్రవాహనం వేగంగా ఢీకొంది.  కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురైన ప్రాంతానికి కొంతదూరంలోనే తండ్రి వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డాడు.  తలకు తీవ్ర గాయమవడంతో వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఉదయగిరికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండటంతో మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ద్విచక్రవాహనంతో ఢీకొన్న వెంకటేష్‌ను ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. తండ్రీ, కుమారులిద్దరూ ఒకే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల్లో మృత్యువు కబళించడంతో కుటుంబీకులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని