సాంఘిక బహిష్కరణపై ఎట్టకేలకు కేసు నమోదు
ఐదేళ్ల కిందట ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడులో అగ్రవర్ణాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణ చేయడంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఐడియల్ దళిత్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఇద్వా) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు.
ఎఫ్‌ఐఆర్ కాపీ చూపిస్తున్న రాజసుందరబాబు
నగరంపాలెం, న్యూస్‌టుడే: ఐదేళ్ల కిందట ప్రత్తిపాడు మండలంలోని పెదగొట్టిపాడులో అగ్రవర్ణాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణ చేయడంతో సుదీర్ఘ పోరాటం తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఐడియల్ దళిత్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఇద్వా) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు. స్థానిక ఆంధ్రక్రైస్తవ కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల కిందట నూతన సంవత్సర వేడుకల్లో అగ్రవర్ణాల వారు పెద్దగొట్టిపాడు దళితవాడపై సామూహికంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌లో 71 మందిపై ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దళితవాడను అగ్రవర్ణాలవారు సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. అప్పటి నుంచి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అనేక రకాలుగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు. దీంతో సోమవారం స్పందనలో ఫిర్యాదు చేయగా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడడంతో బుధవారం ప్రత్తిపాడు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, సాంఘిక బహిష్కరణ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఐదేళ్లు పట్టిందన్నారు. కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేసిన జడ్జి, కలెక్టర్, ఎస్పీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బాధితులు కె.మార్తమ, మౌనిక, శ్రావణి, రోజుమేరి, మరియమ్మ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.