కన్నీరు మిగిలి..

పదిహేనేళ్లుగా కార్యకలాపాలు సాగని క్వారీ అది.. అధికారిక అండతో.. అనధికారిక తవ్వకాలకు ఓ చోటా నాయకుడు తెగబడ్డాడు.. రెండు రోజులుగా తవ్వకాలకు తెరలేపాడు.. అక్రమ పేలుళ్లతో ఏకంగా ఇద్దరి చావుకు కారణమయ్యాడు.

Updated : 09 Dec 2022 05:30 IST

అధికార దందా..
కనుపాప పుట్టిన రోజు..

కన్నోళ్లకు పండగ రోజు..
ముద్దులొలికే మాటలు..

మురిపాల మూటలు...
ఇల్లంతా సందడి..

ఆనందాల ఒరవడి..
అత్యవసర క్షణం..

ఆపద ఉరిమిన తరుణం..
చితికిన తనువులు

చెదిరిన బతుకులు
ప్రేమతో కలిసి సాగారు..

కడకు.. కలిసే వెళ్లారు.
ఇప్పుడే వస్తానన్న అమ్మ..

ఇలలోనే లేదని తెలియదు..
ఆడిస్తానని చెప్పిన నాన్న..

ఆప్యాయతకు రాడని తెలియదు..
నిరీక్షణలో పసి మనసు...
నిర్వేదంలో ప్రతి హృదయం

ఈనాడు, కాకినాడ: పదిహేనేళ్లుగా కార్యకలాపాలు సాగని క్వారీ అది.. అధికారిక అండతో.. అనధికారిక తవ్వకాలకు ఓ చోటా నాయకుడు తెగబడ్డాడు.. రెండు రోజులుగా తవ్వకాలకు తెరలేపాడు.. అక్రమ పేలుళ్లతో ఏకంగా ఇద్దరి చావుకు కారణమయ్యాడు. అక్రమ తవ్వకాల వెనక ఎవరున్నారో తెలిసినా.. రాజకీయ ఒత్తిళ్లతో కీలక శాఖల అధికారులు చర్యలకు వెనకాడుతున్నారు. బేరసారాలతో వ్యవహారాన్ని చక్కబెట్టే చర్యల్లో నాయకులు నిమగ్నమయ్యారు.


ప్రాణాల్ని తోడేసిన అధికార దందా..

ఊహించని ప్రమాదం: రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల గ్రామ గిరిజన దంపతులు వరహాలు, లక్ష్మీదుర్గాభవాని. అతడు కూలీగా, ఆమె యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం పెద్ద పాప పుట్టినరోజు కావడంతో ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇంట్లో మరుగుదొడ్డి లేక గ్రామ శివారున మూతపడిన క్వారీ ప్రాంతానికి బుధవారం సాయంత్రం వెళ్లారు. ఊహించని రీతిన ఒక్కసారిగా భారీ పేలుళ్లలో చిక్కుకున్నారు. పెద్దపెద్ద బండరాళ్లు పైన పడడంతో నుజ్జునుజ్జయి తనువు చాలించగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సుదీర్ఘంగా శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు.

అక్రమ పేలుళ్లే: ఎస్‌.పైడిపాల సమీపంలో మాతయ్యపేట వైపు వెళ్లే మార్గంలో అర ఎకరాకు పైనే నల్లరాయి కొండ ఉంది. కీలక నిర్మాణాలకు నల్లరాయి అవసరం పెరిగి కొందరు దొడ్డిదారి సంపాదనలో పడ్డారు. అధికారిక అండ, రాజకీయ దన్నుతో అక్రమాలకు తెగించారు. ఈ క్రమంలోనే క్వారీ ప్రాంతంలో పలుచోట్ల అనధికారిక తవ్వకాలకు తెరలేచింది. ఓ గ్రామస్థాయి నాయకుడు మరికొందరితో కలిసి దొడ్డిదారిన పేలుడు సామగ్రి తెప్పించి ఈ క్వారీలో అక్రమ తవ్వకాలకు తెరలేపారు.


తెరవెనుక ఎవరు..?: ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాకినాడ భూగర్భ గనులశాఖ డీడీ కార్యాలయం నుంచి బృందం వచ్చి పరిశీలించింది. క్వారీ అనధికారికమని గుర్తించినా.. పేలుళ్లకు అనుమతులు లేవని పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు తేల్చినా.. తవ్వకాలకు తెగబడిందెవరో స్పష్టత ఇవ్వలేదు. విచారణ సాగుతోందని వెల్లడించారు. క్వారీ ప్రాంతంలో బాధితులు ఆందోళన చేస్తే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చి పంపేశారు. తెరవెనుక ఎవరున్నారో తెలిసినా రాజకీయ ఒత్తిళ్లతో చర్యలకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్నది మిస్టరీగా ఉందని.. తవ్వకాలకు ఎవరు పాల్పడ్డారో స్థానికులు చెప్పడం లేదని డీడీ నరసింహారెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని