పెళ్లికి ఒత్తిడి చేయడంతోనే దాడి

స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది.

Updated : 09 Dec 2022 05:38 IST

స్నేహితుడిపై కత్తి దూసిన యువతికి బెయిలు

చికిత్స పొందుతున్న అశోక్‌కుమార్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: స్నేహంగా మెలుగుతున్నందుకు చనువుతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన యువతికి గురువారం బెయిలు లభించింది. పోలీసులు, స్థానికులు, వసతిగృహ నిర్వాహకుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ).. భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. ఆయన కుమార్తె లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ చదివింది. తండ్రితో విభేదాలు రావడంతో ఆర్నెల్ల క్రితం నగరానికి వచ్చింది. క్రికెట్‌ శిక్షణ, ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చానంటూ కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని శ్రీతనూజ హాస్టల్‌లో చేరింది. రాత్రి 10 గంటలకే హాస్టల్‌ గేట్లు మూసేస్తారు. లక్ష్మీ సౌమ్య నిత్యం ఆలస్యంగా చేరుకునేది. హాస్టల్‌ నిర్వాహకులు ఆమెను ఖాళీ చేయించగా తొమ్మిదో ఫేజ్‌లో అద్దె గదిలో ఉంటోంది. పేరుకు యువతే అయినా ఆమె వేషధారణ, భాష కాస్త విభిన్నంగా ఉండేది. ఈమె హాస్టల్‌లో ఉన్నప్పుడు సమీపంలోని దేవీ లగ్జరీ బాయ్స్‌ హాస్టల్‌లో గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్‌కుమార్‌(27)తో పరిచయమైంది. ఇతని సోదరి సమీపంలోని హాస్టల్‌లోనే ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. తండ్రి సొంతూరులో ఆటోడ్రైవర్‌. అశోక్‌కుమార్‌, లక్ష్మీ సౌమ్య నిత్యం ఓ టీ స్టాల్‌ వద్ద కలుసుకుని మాట్లాడుకునేవాళ్లు. ఈక్రమంలో ఆమెకు అశోక్‌కుమార్‌ కొంత నగదు ఇచ్చాడు. అలా ఏర్పడిన చనువుకొద్దీ పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. ఆమె మౌనం వహించేది. ఈనెల 5న అతడి పుట్టినరోజు ఉండటంతో ఖర్చులకు తానిచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. మాటమాట పెరిగి డబ్బులివ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. చాకు లాంటి మినీ కట్టర్‌తో దాడి చేసింది. అతని మెడపై ఎడమ దవడ కిందిభాగంలో తీవ్ర గాయమైంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ముఖానికి సంబంధించిన నరం తెగిందని, ముఖం ఎడమ వైపు పక్షవాతం వచ్చిందని, రెండు రోజుల్లో డిశ్ఛార్జ్‌ అవుతాడని వైద్యులు తెలిపారు.
పరిస్థితులే కారణం: లక్ష్మీ సౌమ్య
తరచూ పెళ్లి ప్రస్తావన తేవడంతోపాటు గొడవ పడేవాడని, వద్దని వారిస్తున్నా వినలేదని, సహనం నశించి దాడి చేశానని, తాను ఇలా తయారవడానికి పరిస్థితులే కారణమని లక్ష్మీ సౌమ్య పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లు తెలిసింది. గురువారం పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌ మంజూరైంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు