Hyderabad: దమ్మాయిగూడలో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం

మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Updated : 16 Dec 2022 13:04 IST

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ పరిధిలో బాలిక అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు (10) మృతదేహాన్ని అనుమానాస్పద రీతిలో చెరువులో గుర్తించారు. దమ్మాయిగూడలోని అంబేడ్కర్‌ నగర్‌ చెరువు నుంచి బాలిక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నాలుగో తరగతి చదువుతున్న ఇందును తండ్రి నరేశ్‌ గురువారం ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాల వద్ద విడిచిపెట్టారు. ఆ తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది సమాచారం అందించారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు..  చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాలిక పాఠశాలకు వెళ్లి కనిపించకుండాపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. చుట్టు పక్కల గాలించి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ చోట బాలిక వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దాని ఆధారంగా విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు.

బాలిక ఏ విధంగా చెరువు వద్దకు వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక మాత్రమే అక్కడికి వెళ్లిందా? ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారిస్తున్నారు. పాఠశాల నుంచి చెరువు వద్దకు వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తమ కుమార్తె కిడ్నాప్‌నకు గురైందని.. పోలీసుల జాప్యంతోనే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు దమ్మాయిగూడ చౌరస్తాలో బాలిక కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాల సిబ్బంది, పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో వాహనాలన్నీ నిలిచిపోయాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని