Mancherial: వారం రోజులుగా రెక్కీ..!

మందమర్రి మండలం గుడిపెల్లి (వెంకటాపూర్‌)లో ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

Updated : 19 Dec 2022 09:17 IST

రూ.5 వేల పెట్రోల్‌తో  ఆరుగురిని ఆహుతి చేశారు
కిటీకీలు, తలుపుల దగ్గరే శవాలు
పోలీసుల అదుపులో 10 మంది నిందితులు

ఈనాడు డిజిటల్‌, మంచిర్యాల; న్యూస్‌టుడే, మందమర్రి పట్టణం: మందమర్రి మండలం గుడిపెల్లి (వెంకటాపూర్‌)లో ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలికి 8 కి.మీ. దూరంలో ఉన్న సీసీసీ పెట్రోల్‌ బంక్‌లో ముగ్గురు వ్యక్తులు రూ.5 వేల పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షెట్టిపేటకు చెందిన వ్యక్తి, ఉట్కూర్‌కు చెందిన మరో వ్యక్తితో పాటు, గోదావరిఖనిలో అయిదుగురు, ఆటోలో ఉన్న ఇద్దరు, గుడిపెల్లికి చెందిన వ్యక్తి మొత్తం పది మందిని మరిన్ని వివరాల కోసం విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

లక్షెట్టిపేట, ఉట్కూర్‌కు చెందిన ఇద్దరు మంచిర్యాలలో ఓ లాడ్జిలో వారం నుంచి ఉంటున్నారు. వారు పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈ నెల 16న శ్రీరాంపూర్‌కు చెందిన ఆటో మాట్లాడుకుని అప్పటికే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్‌లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్‌ తీసుకున్నారు. గుడిపెల్లికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దగ్గర దారిలో కాకుండా... రసూల్‌పెల్లి మీదుగా గుడిపెల్లికి 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించారు. మార్గంమధ్యలో మద్యం తాగిన వీరు రాత్రి 11.15 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. 11.45-12.15 సమయంలో బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్‌ గుమ్మరించారు. మంటలు రేగాక చుట్టుపక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్‌ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలోనే పరారయ్యారు. అనంతరం లాడ్జికి చేరుకుని 17న అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్‌కు చెందిన వ్యక్తిపై ఇంతకుముందే హత్య కేసు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన వ్యక్తి తమ్ముడికి అక్రమ సంబంధం ఉండడంతో 15 సంవత్సరాల క్రితం ఆయనను హతమార్చినట్లు విచారణలో వెలుగుచూసింది.

సుపారీ తీసుకుని.. తప్పుడు సమాచారం ఇచ్చి..

గుడిపెల్లికి చెందిన ఓ వ్యక్తి దుండగులకు సహకరించినట్లుగా పోలీసులు తేల్చారు. గ్రామంలో మాస పద్మ శివయ్య దంపతులు, శాంతయ్య ఉన్నారా లేదా నిర్ధారించుకుని చెప్పేందుకు ఇతనితో రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు ఫూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి ఇంట్లో ముగ్గురే ఉన్నారని తప్పుడు సమాచారం ఇవ్వడంతో చుట్టం చూపుగా వచ్చిన మౌనిక, ఇద్దరు పిల్లలు కూడా మంటలకు ఆహుతయ్యారు. ఘటన జరిగిన మరుసటి ఉదయం కూడా ఈ వ్యక్తి ఘటన స్థలంలోనే ఉన్నాడని, హంతకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడని పోలీసులు గుర్తించారు.

అమ్మ ఒడిలోనే బూడిదైన చిన్నారి

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో అగ్ని కీలలకు ఆహుతైన ఆరుగురు మంటల్లో మండుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటిద్వారం వరకు వచ్చి మాంసపు ముద్దలుగా మారిన తీరు అందరినీ కలచివేస్తోంది. ఇందులో మౌనిక తన రెండేళ్ల కూతురు ప్రశాంతిని ఒడిలోనే ఉంచుకుని బూడిదైంది. మృతులందరి ఎముకలు, ఇతర శరీర భాగాలు తలుపులు, కిటికీల దగ్గరే ఉన్నాయి. వారంతా ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినా, తలుపు గడియపెట్టి ఉండడంతో బయటపడే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. కాగా ఘటనలో మృతిచెందిన శాంతయ్య శవం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరీలోనే ఉంది. ఆదివారం సైతం శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈయన కుటుంబ సభ్యులు, అనుమానం ఉన్న ఇతర బంధువులను పోలీసులు గోదావరిఖనిలో అదుపులోకి తీసుకున్నారు.

సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్‌...

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ గుడిపల్లి ఘటనను ఆదివారం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 2023 జనవరి 27వ తేదీలోపు నివేదిక సమర్పించాలని రామగుండం పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు