Crime News: ప్రేమంటూ వేధించాడు.. ప్రాణాలు కోల్పోయాడు..!

ఇద్దరు యువకులు వెంబడించి ‘ప్రేమిస్తావా.. చస్తావా’ అని వేధించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే.

Updated : 01 Jan 2023 07:19 IST

యువతి మృతికి కారణమైన యువకుడి బలవన్మరణం

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: ఇద్దరు యువకులు వెంబడించి ‘ప్రేమిస్తావా.. చస్తావా’ అని వేధించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఆ యువకుల్లో ఒకరైన రోహిత్‌ భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.

పాల్వంచ పట్టణ ఎస్సై ప్రవీణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యానంబైలుకు చెందిన బొప్పిశెట్టి సుజాత-నర్సింహారావు దంపతుల కుమార్తె సాయికీర్తి(19) ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ రోహిత్‌(22)తో పాటు ఖమ్మం నగరానికి చెందిన తరుణ్‌ ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డారు. వేధింపులు తాళలేని ఆ యువతి గతనెల 24న మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం తహసీల్దార్‌ బంజరలోని అమ్మమ్మ ఇంట్లో ఉరేసుకుంది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28న మృతిచెందింది. నిందితుల్లో ఒకరైన రోహిత్‌ అదేరోజు సాయంత్రం పాల్వంచలోని బంధువుల ఇంట్లో గడ్డిమందు తాగాడు. వెంటనే అతడిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు.

ఈ నెల 29న ఆసుపత్రి వార్డు నుంచి రోహిత్‌ ఎటో వెళ్లిపోగా అదేరోజు రాత్రి బంధువులు మళ్లీ తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోహిత్‌ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా తల్లి అన్నీ తానై సాకుతోంది. ఒక్కగానొక్క కుమారుడి మృతితో ఆమె రోదిస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాల్వంచ ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని