Andhra News: పింఛన్ల నగదులో దొంగ నోట్లు మార్చింది గ్రామ వాలంటీరే..

ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగుచూశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో కలకలం రేపింది.

Updated : 02 Jan 2023 08:43 IST

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ సామాజిక పింఛన్ల నగదులో దొంగ నోట్లు వెలుగుచూశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో కలకలం రేపింది. ఎప్పటిలాగే సచివాలయ సంక్షేమ సహాయకుడు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి ఎస్సీ కాలనీకి చెందిన వాలంటీరు ఎం.ఆమోస్‌కు అందించారు. ఆమోస్‌ ఆదివారంనాడు లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. పింఛను అందుకున్న మహిళ రూతమ్మ రూ.500 నోట్లు మూడింటిని నకిలీవిగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటివరకు పంచిన నగదును వారు లబ్ధిదారులవద్ద పరిశీలించగా అందులో 39 (రూ.500ల) నోట్లు నకిలీవిగా తేలాయి. దీనిపై ఎంపీడీవో రంగసుబ్బరాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత బుకాయించిన సదరు వాలంటీరు అధికారులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం అంగీకరించాడు. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. అమోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయనేది విచారణలో తేలాల్సి ఉంది.


కుమార్తెను వాలంటీరు అపహరించాడని తండ్రి ఫిర్యాదు

గంగవరం, న్యూస్‌టుడే: తన కుమార్తెను గ్రామ వాలంటీరు అపహరించాడని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో చోటుచేసుకుంది. బాలిక (14) పదో తరగతి చదువుతోంది. ఆదివారం ప్రత్యేక తరగతులున్నాయని ఉదయం ఇంటి నుంచి బాలిక వెళ్లింది. మధ్యాహ్నం వరకు ఇంటికి రావపోవడంతో బంధువుల ఇళ్లలో గాలించినా నిష్ఫలమైంది. తన కుమారైను వాలంటీరు జి.సునీల్‌ అపహరించి ఉంటాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని