Telangana News: రూ.1.50 లక్షలు చోరీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయన. పాఠాలతోపాటు విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తూ మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన ఆ ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు.

Updated : 19 Jan 2023 06:53 IST

గతంలో ఓ ఉపాధ్యాయురాలికి అసభ్య సందేశాలు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆయన. పాఠాలతోపాటు విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తూ మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన ఆ ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు. నేరప్రవృత్తిని అలవర్చుకుని వివాదాస్పదమయ్యాడు. గతంలో ఓ ఉపాధ్యాయురాలి సెల్‌ఫోనుకు అసభ్యకర సందేశాలు పంపి సస్పెన్షన్‌కు గురైన అతను తాజాగా సంగారెడ్డిలో రూ.1.50 లక్షలు చోరీ చేశాడు.

డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాలు.. సంగారెడ్డికి చెందిన విద్యుత్‌ శాఖ ఉద్యోగి కె.రాములు ఈ నెల 10న స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో రూ.1.50 లక్షలు డ్రా చేసుకున్నారు. భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లిన రాములు మార్గంమధ్యలో కూరగాయల కొనుగోలుకు ఆగారు. వారిని బ్యాంకు నుంచి ద్విచక్రవాహనంతో అనుసరిస్తూ వచ్చిన సార సంతోష్‌ రూ.1.50 లక్షల నగదు ఉన్న సంచిని లాక్కొని పరారయ్యాడు. బాధితుడు అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించిన పోలీసులు డబ్బులు తస్కరించింది జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంతోష్‌గా గుర్తించారు. ఈ నెల 17న నిందితున్ని సంగారెడ్డిలో పట్టుకుని విచారించారు.

దుర్వ్యసనాలకు అలవాటుపడిన ఆయన తన ద్విచక్రవాహనం నంబరు ప్లేటును తిప్పి బిగించుకుని పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు తేలింది. నాలుగు నెలల క్రితం జిల్లాలోని ఓ ప్రధానోపాధ్యాయురాలి సెల్‌ఫోన్‌కు సంతోష్‌ అసభ్యకర సందేశాలు పంపి ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సంతోష్‌ను సస్పెండ్‌ చేశారు. కొన్ని రోజుల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు. అయినా బుద్ధి మార్చుకోని ఆ ఉపాధ్యాయుడు తాజాగా చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని