Crime News: ఏం కష్టమొచ్చింది తల్లీ!

బాసర గోదావరి తీరం... ఓ తల్లి ఇద్దరు పిల్లలతో వచ్చింది. బాక్సుల్లో ఉన్న అన్నాన్ని తినిపించి మంచి నీళ్లు తాగించింది. బూట్లు విప్పి స్కూలు బ్యాగులను పక్కనబెట్టింది.

Updated : 24 Jan 2023 07:45 IST

స్నానానికి అనుకుంటే   ప్రాణాలు తీసుకున్నారు!
బాసర గోదావరిలో ఇద్దరు   పిల్లలతో తల్లి ఆత్మహత్య

ముథోల్‌ (బాసర), న్యూస్‌టుడే: బాసర గోదావరి తీరం... ఓ తల్లి ఇద్దరు పిల్లలతో వచ్చింది. బాక్సుల్లో ఉన్న అన్నాన్ని తినిపించి మంచి నీళ్లు తాగించింది. బూట్లు విప్పి స్కూలు బ్యాగులను పక్కనబెట్టింది. వారు స్నానానికి వెళ్తున్నారని..చూసిన వారంతా అనుకున్నారు. ఆమె ఇంకా లోపలికి వెళ్తుండటంతో కొంతమంది కీడు శంకించారు. ఒక వ్యక్తి పరుగులు పెట్టి వెళ్లేసరికే ముగ్గురూ నీటమునిగారు. తమ కళ్ల ముందే ముగ్గురు విగత జీవులుగా మారడం చూసి యాత్రికులు తల్లడిల్లిపోయారు. ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో అని చర్చించుకున్నారు. నిర్మల్‌ జిల్లా బాసర సమీపంలోని గోదావరిలో సోమవారం ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌ పెద్దబజార్‌లో మానస(27) ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. పదేళ్ల క్రితం మహబుబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన వెంకటేశ్వర్‌తో వివాహం జరిగింది. వారికి బాలాదిత్య(8), భవ్యశ్రీ (7) ఇద్దరుపిల్లలున్నారు. భర్తకు ఆరోగ్యం బాగోలేక అయిదేళ్ల క్రితం నిజామాబాద్‌లో ఉంటున్న మానస అన్నయ్య సందీప్‌ వద్దకు వచ్చారు. మూడేళ్ల క్రితం వెంకటేశ్వర్లు మృతి చెందారు. అప్పటినుంచి ఆమె ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలను చదివించుకుంటోంది. సందీప్‌కు పిల్లలు లేకపోవడంతో మానస పిల్లలను పెంచుకోవాలని వారితో ప్రేమగా ఉంటున్నారు. మానస నిజామాబాద్‌లోని షాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేసేది. ప్రతి రోజులాగే సోమవారం దుకాణం వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. తర్వాత పాఠశాలకు వెళ్లి ఇద్దరు పిల్లలను తీసుకొని బస్సులో బాసరకు వెళ్లింది. గోదావరిలో పిల్లలతో కలిసి తనువు చాలించింది. పాఠశాల బ్యాగుల్లోని పిల్లల పుస్తకాలలో ఉన్న సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు.మానస అన్నయ్య సందీప్‌ వచ్చి గమనించి వారిని చూసి రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అనంతరం ముథోల్‌ సీఐ వినోద్‌రెడ్డి, ఎస్‌ఐ మహేష్‌లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు. భర్తలేక ఒంటరిగా జీవిస్తూ, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మానస అన్న సందీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ద]ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని