బీటెక్‌ కావాలా.. బీకాం కొంటారా!

ఉత్తీర్ణులుకానివారు, కళాశాల మానేసిన(డ్రాపౌట్లు) విద్యార్థుల సమాచారం సేకరించి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించి దాదాపు రూ.5 కోట్ల వరకూ సంపాదించిన హైటెక్‌ ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు.

Published : 25 Jan 2023 03:13 IST

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా పట్టివేత

ఈనాడు- హైదరాబాద్‌: ఉత్తీర్ణులుకానివారు, కళాశాల మానేసిన(డ్రాపౌట్లు) విద్యార్థుల సమాచారం సేకరించి నకిలీ ధ్రువపత్రాలు విక్రయించి దాదాపు రూ.5 కోట్ల వరకూ సంపాదించిన హైటెక్‌ ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల నుంచి 86 నకిలీ ధ్రువపత్రాలు, 71 తెలంగాణ ఇంటర్‌ బోర్డు సర్టిఫికెట్లు, 10 రబ్బరు స్టాంపులు, ఏడు ఫోన్లు, ఎస్‌ఎస్‌సీ మెమోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డితో కలిసి రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మంగళవారం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.

నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన చింతకాయల వెంకటేశ్వర్లు(51) హైదరాబాద్‌లో రెండు కళాశాలల్లో కరస్పాండెంట్‌గా పనిచేశాడు. అవి మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులతో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగాడు. ఇతనికి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన పాత నేరస్థుడు ఆకుల రవి అవినాశ్‌ అలియాస్‌ అజయ్‌(38)తో పరిచయం ఏర్పడింది. తనతో కలిసి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతావంటూ వెంకటేశ్వర్లును నమ్మించాడు. అప్పటికే తాను పనిచేసిన రెండు కళాశాలల్లో డ్రాపౌట్లు, ఉత్తీర్ణులుకాని విద్యార్థుల జాబితాను వెంకటేశ్వర్లు సేకరించాడు. వారికి ఫోన్లు చేసి అవసరమున్న కోర్సుల్లో నకిలీ సర్టిఫికెట్లు విక్రయించి ఒక్కొక్కరి నుంచి రూ.3-3.5 లక్షలు తీసుకునేవారు. మూడేళ్ల నుంచి ఈ దందా నడిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన గృహిణి గండికోట జ్యోతిరెడ్డి(45), నల్గొండ జిల్లా కేతేపల్లికి చెందిన ప్రైవేటు ఉద్యోగి కొండ్రె నవీన్‌కుమార్‌(28) మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. చైత్యనపురికి చెందిన పెద్దుకొట్ల అభిలాష్‌కుమార్‌(25), నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన బిల్లకంటి కల్యాణ్‌(23) బీటెక్‌ పట్టాలు, అసిఫ్‌నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌(50) బీఎస్సీ, చెంగిచెర్లకు చెందిన గోపిగారి వైశాలి(26) బీకాం సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. నగరంలో కొందరు పెద్దఎత్తున ధ్రువపత్రాలు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ బృందం ఏడుగుర్ని అరెస్టు చేశారు. 

నకిలీవని గుర్తించకుండా జాగ్రత్త

నకిలీ సర్టిఫికెట్లు విక్రయించే ఆకుల రవి కుమార్‌ వాటిని తనిఖీ చేసినా అసలైనవేనని నమ్మించేందుకు ఒక లింకు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. ‘‘నిందితులు విక్రయించే ధ్రువపత్రాలను ఆయా యూనివర్సిటీలు, బోర్డుకు సంబంధించిన వ్యక్తులు తనిఖీ చేస్తే కచ్చితంగా నకిలీవని గుర్తిస్తారు. ఉద్యోగాలిచ్చే ప్రైవేటు యాజమాన్యాలు, ఇతర సంస్థలు తనిఖీ చేసినప్పుడు మాత్రం అసలైనవిగా కనిపించేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రధాన నిందితుడు రవి దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’’ అని ఓ అధికారి తెలిపారు. ఈ ముఠా నుంచి నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన విద్యార్థులపైనా పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నలుగురిని నిందితులుగా చేర్చారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని