నకిలీ నోట్ల ముఠాలో వైకాపా నాయకురాలు

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా పని చేస్తున్న రసపుత్ర రజనిని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో కలకలం రేపింది.

Published : 25 Jan 2023 04:43 IST

రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌  డైరెక్టర్‌ రజనిని అరెస్టు చేసిన  బెంగళూరు పోలీసులు

ఈనాడు డిజిటల్‌, కడప: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా పని చేస్తున్న రసపుత్ర రజనిని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం జిల్లాలో కలకలం రేపింది. వైకాపా ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలు, కార్పొరేషన్‌ పదవిని అడ్డంపెట్టుకుని ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌తో పాటు రజనిని సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈమె ప్రొద్దుటూరులో వైకాపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే  రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అండదండలతో కార్పొరేషన్‌ డైరెక్టరు పదవి దక్కించుకున్నారు. ఇటీవల పదవీకాలం ముగియడంతో తిరిగి పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమె వద్ద రూ.44 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువకు కొని బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు అనుచరురాలిగా ఉన్న ఈ మహిళా నేత... దొంగనోట్ల కేసులో పోలీసులకు చిక్కడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈమె 2017లో ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీమొత్తంలో డబ్బు వసూలు చేసి ఐపీ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ప్రభుత్వంలోని పలువురు పెద్దలతో ఫొటోలు దిగడం... వాటిని నిరుద్యోగులకు చూపించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

ఇటీవల వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో దొంగనోట్ల చలామణి ఎక్కువగా సాగింది.  నకిలీ నోట్లు చలామణి చేస్తున్న పలువురు నిందితులను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో జరిగిన నకిలీ నోట్ల చలామణి వ్యవహారంలో కూడా రజని పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కర్ణాటక పోలీసులు సైతం ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. అనంతపురం, ప్రొద్దుటూరులకు కర్ణాటక పోలీసులు విచారణకు వస్తున్నట్లు సమాచారం.

రాచమల్లు హస్తం ఉంది... తెదేపా

నకిలీ నోట్ల చలామణి ముఠాతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి సంబంధాలున్నట్లు తెదేపా ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకే రజని దొంగనోట్లు మార్చుతున్నట్లు విమర్శించారు. ప్రొద్దుటూరులో అప్పులు చేసి ఐపీ పెట్టిన మహిళకు... కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పించారని ఆరోపించారు. దొంగనోట్ల తయారీ, చలామణిలో ఎమ్మెల్యేనే సూత్రధారి అని... దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 

నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాచమల్లు

రజని వ్యవహారంపై తనకెలాంటి సంబంధమూ లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. విచారించి అందులో వాస్తవం ఉంటే వెంటనే ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పాత్ర ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని