పరిహారం రాలేదని మనస్తాపం.. గుండెపోటుతో బస్వాపురం నిర్వాసితుడి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్‌ ముంపు గ్రామమైన బీఎన్‌ తిమ్మాపురంలో బుధవారం జూపల్లి నరసింహ (48) అనే నిర్వాసితుడు గుండెపోటుతో మృతిచెందారు.

Updated : 26 Jan 2023 06:17 IST

 

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి గ్రామీణం: యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్‌ ముంపు గ్రామమైన బీఎన్‌ తిమ్మాపురంలో బుధవారం జూపల్లి నరసింహ (48) అనే నిర్వాసితుడు గుండెపోటుతో మృతిచెందారు. ఆటో నడుపుతూ జీవిస్తున్న ఈయనకు గ్రామంలో 20 గుంటల భూమి ఉంది. ఇప్పటికే 10 గుంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించగా.. మరో పది గుంటలకు పరిహారంతో పాటు ఇల్లు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రావాల్సి ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అధికారులు మంగళవారం గ్రామంలోని ప్రతి ఇంటికీ నోటీసులివ్వడానికి వెళ్లడంతో ఇక తమను పంపించేయనున్నారని నరసింహకు బెంగ పట్టుకుంది. బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందారు. ఆయన భార్య అనిత కూడా అస్వస్థతకు గురయ్యారు. పరిహారం అందకపోవడం వల్లే నరసింహ మృతిచెందారని ఆరోపిస్తూ ఆయన మృతదేహంతో తిమ్మాపూర్‌ గ్రామస్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు బయల్దేరారు. మాస్‌కుంట వద్ద పోలీసులు అడ్డుకోగా.. అక్కడే  ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు, అతడి ముగ్గురు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ చేశారు. నీటిపారుదలశాఖ అధికారులొచ్చి.. బాధిత కుటుంబానికి రూ.లక్ష అందించారు. త్వరలోనే మరో రూ.లక్ష చెల్లిస్తామని చెప్పడంతో గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి చొరవతో పునరావాస ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం రూ.46.35 కోట్ల విడుదలకు అనుమతించిందని, వారంలో పరిహారం చెల్లిస్తామని కలెక్టరు పమేలా సత్పతి  వెల్లడించారు. మృతుడు నరసింహకు సెప్టెంబరులో రూ.7.61 లక్షల పరిహారం చెల్లించామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు