Andhra News: ఉన్నత చదువులకు వెళ్లి.. అమెరికాలో ఆదోని యువతి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతిని రోడ్డు ప్రమాదం బలిగొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...  కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీలో నివాసముంటున్న కందుల శ్రీకాంత్‌, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

Updated : 26 Jan 2023 06:58 IST

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతిని రోడ్డు ప్రమాదం బలిగొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...  కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీలో నివాసముంటున్న కందుల శ్రీకాంత్‌, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జాహ్నవి (23) డిగ్రీ పూర్తి చేశారు. పై చదువుల కోసం 2021 సెప్టెంబరు 20న అమెరికా వెళ్లారు. ఈ నెల 23న కళాశాలకు వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి బయల్దేరారు. రహదారి దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం జాహ్నవిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు.

ఈ మేరకు మరుసటి రోజు తమకు సమాచారం అందిందని చెబుతూ యువతి తాత సూరిబాబు కన్నీరుమున్నీరయ్యారు. మరో నాలుగైదు నెలల్లో చదువు పూర్తవుతుందని, ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్న సమయంలో జాహ్నవిని ప్రమాదం బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె మరణ వార్త తెలిసి తల్లి విజయలక్ష్మి నోట మాటరాక కుప్పకూలిపోయారు. జాహ్నవి మృత దేహాన్ని మరో రెండు రోజుల్లో స్వస్థలానికి తీసుకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని