పాముతో ఫొటో సరదా.. కాటేయడంతో యువకుడి మృతి

పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు.

Updated : 26 Jan 2023 06:15 IST

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పాముతో ఫొటో తీసుకోవాలని యత్నించిన యువకుడు దాని కాటుకు గురై మృతిచెందిన ఉదంతమిది... ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడుకు చెందిన పోలంరెడ్డి రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల కుమారుడు మణికంఠారెడ్డి(23). డిగ్రీ చదివి, కందుకూరులోని ఆర్టీసీ డిపో సమీపంలో లస్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వెంకటస్వామి అనే వ్యక్తి పామును ఆడిస్తూ లస్సీ దుకాణం దగ్గరకు వచ్చాడు. పామును మెడలో వేసుకుని ఫొటో తీయించుకోవాలని మణికంఠ సరదా పడ్డారు. పక్కనే మరో దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని పిలిచి తన సెల్‌ఫోన్‌ను అతనికిచ్చి... ఫొటోలు, వీడియోలు తీయాలని చెప్పి పామును మెడలో వేసుకున్నారు. ఈ క్రమంలో పాము కింద పడింది. దాన్ని పైకి లాగడంతో మణికంఠ చేతిపై కాటేసింది. అతడిని స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలులోని రిమ్స్‌కు పంపారు. అప్పటికే మృతిచెందినట్లు రిమ్స్‌ వైద్యులు తెలిపారు. బంధువులు మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి బొద్దికూరపాడుకు తరలించారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో... ఫోన్‌లో ఉన్న ఫొటోలు చూస్తే తల్లిదండ్రులు మందలిస్తారని వాటిని డిలీట్‌ చేయించినట్లు తెలిసింది. చేతికి అందొచ్చిన కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. రాఘవరెడ్డి, సరస్వతి దంపతుల చిన్న కుమారుడు ఇంద్రారెడ్డి ఐదేళ్ల కిందట కిడ్నీ సమస్యతో చనిపోయినట్లు బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట్రావు, పట్టణ ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపారు. పామును ఆడిస్తున్న వెంకటస్వామిపై జంతుహింస చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని