పెళ్లింట పెనువిషాదం

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడి ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. ఇంతలోనే ఏమైందో పెళ్లికొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Published : 27 Jan 2023 06:44 IST

గుండెపోటుతో వరుడి మృతి

ఉట్నూరు, న్యూస్‌టుడే: కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడి ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. ఇంతలోనే ఏమైందో పెళ్లికొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషాదం ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో చోటుచేసుకుంది. ఈ అనుకోని సంఘటన వధూవరుల కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఉట్నూరుకు చెందిన రావుల శంకరయ్యచారి, భూలక్ష్మీ దంపతుల పెద్ద కుమారుడు సత్యనారాయణచారి(34)కి జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం వైభవోపేతంగా పెళ్లి జరగాల్సి ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంతోషంగా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుండగా.. ఒక్కసారిగా రక్తపోటు పెరగడంతో వరుడు ఇంట్లో పడిపోయారు. కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యసేవలు అందించారు. గుండెపోటుతో పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతిచెందారు. చేతికొచ్చిన కుమారుడు వివాహానికి కొన్నిగంటల ముందు అకస్మాత్తుగా మరణించడంతో కన్నవారు జీర్ణించుకోలేకపోయారు. సత్యనారాయణచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు