Crime News: బ్రెయిన్‌ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు

ఏడాది కిందట అదృశ్యమై, శవమై కనిపించిన శ్రేయస్‌ (19) అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

Updated : 27 Jan 2023 07:39 IST

బెంగళూరు (రామనగర), న్యూస్‌టుడే: ఏడాది కిందట అదృశ్యమై, శవమై కనిపించిన శ్రేయస్‌ (19) అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో క్రిమినల్‌ న్యాయవాది శంకర్‌గౌడ, అతని అనుచరుడు అరుణ్‌ను ప్రధాన నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్ష ద్వారా నేరాన్ని నిర్ధారించినట్లు రామనగర జిల్లా ఎస్పీ సంతోష్‌బాబు గురువారం విలేకరులకు వివరించారు. బ్రెయిన్‌ మ్యాపింగ్‌ ద్వారా నిందితులను గుర్తించడం కర్ణాటకలో ఇదే తొలిసారి. బెంగళూరు సమీపంలోని కనకపురకు చెందిన శ్రేయస్‌ చదువుకుంటూనే శంకర్‌గౌడ కార్యాలయంలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసేవారు. 2022 మే 19న రాత్రి ఫోన్‌ రావడంతో ఇంట్లో నుంచి బయల్దేరిన ఆయన ఎంతకీ తిరిగిరాకపోవడంతో తల్లి ఆశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కాల్‌డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. మృతదేహం దొరికిన తర్వాత వైద్య పరీక్షల్లో అసహజ లైంగిక క్రియ అనంతరం శ్రేయస్‌ను ఊపిరాడకుండా చేసి, చంపేసినట్లు నివేదిక వచ్చింది. తమకు ఈ హత్యతో సంబంధం లేదని నిందితులు వాదించారు. దీంతో శంకర్‌గౌడకు బ్రెయిన్‌ మ్యాపింగ్‌ విధానంలో తలకు సెన్సర్లు బిగించి, నిపుణులు, వైద్యుల సహాయంతో పరీక్ష చేశారు. శ్రేయస్‌కు మత్తు పానీయం ఇచ్చి, లైంగిక చర్య అనంతరం గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పడేశామని నిందితుడు ఈ పరీక్షలో అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని