రుణ యాప్‌ల వేధింపులకు యువకుడి బలి

రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులతో విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి గ్రామం సూరాయిపాలెం వాసి తంగెళ్లమూడి రాజేష్‌ (35) శనివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 30 Jan 2023 03:37 IST

గొల్లపూడి, న్యూస్‌టుడే: రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులతో విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి గ్రామం సూరాయిపాలెం వాసి తంగెళ్లమూడి రాజేష్‌ (35) శనివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. తొమ్మిదేళ్ల క్రితం రత్న అనే యువతిని రాజేష్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా రాజేష్‌ ఉద్యోగానికి సరిగా వెళ్లట్లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 30 యాప్‌ల నుంచి రూ.1.50 లక్షల వరకూ రుణాలు తీసుకున్నారు. తీసుకున్న డబ్బుల కంటే ఎక్కువగా చెల్లించాలని నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించారు. తీరుస్తానని నచ్చజెప్పినా వినిపించుకోలేదు. శనివారం ఒకేసారి అందరూ ఫోన్లు చేసి వేధించారు. రాజేష్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి అతడికీ, భార్యకూ వాటిని పంపించారు. బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరించారు. దాంతో రాజేష్‌ తట్టుకోలేక భార్యకు ఫోన్‌ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీంతో కంగారుపడిన ఆమె యాప్‌ల నిర్వాహకులకు ఒకరోజు గడువు ఇవ్వాలని.. డబ్బులు కడతామని చెప్పారు. అయినా వారు వినలేదు. వెంటనే డబ్బులు కట్టాలని బెదిరించారు. మరో రోజు గడువిస్తే రూ.3వేల జరిమానా పడుతుందని బెదిరించారు. చివరకు భార్య రత్న ఇంటికి వచ్చి చూసేసరికి రాజేష్‌ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. తన భర్త చనిపోయినా ఇప్పటికీ కాల్స్‌ వస్తూనే ఉన్నాయని.. యాప్‌ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రత్న అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని