కేసు విచారణకు వచ్చిన పోలీసులపై దాడి

కేసు విచారణలో భాగంగా రాత్రి పూట తండాకు వచ్చిన పోలీసులపై స్థానికులు దొంగలుగా భావించి దాడికి పాల్పడ్డారు.

Updated : 30 Jan 2023 06:14 IST

మఫ్టీలో రావడంతో దొంగలుగా భావించిన స్థానికులు

భువనగిరి నేరవిభాగం, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: కేసు విచారణలో భాగంగా రాత్రి పూట తండాకు వచ్చిన పోలీసులపై స్థానికులు దొంగలుగా భావించి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పార్యారం గ్రామ పరిధిలోని గద్దెరాళ్ల తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలో ఈ నెల 23న జరిగిన దారిదోపిడీ కేసు దర్యాప్తులో భాగంగా అల్వాల్‌ సీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) కిరణ్‌కుమార్‌, మేడ్చల్‌, శామీర్‌పేట ఎస్సైలు సత్యనారాయణ, మునీందర్‌, కానిస్టేబుల్‌ సతీశ్‌ మఫ్టీలో, ప్రైవేట్‌ వాహనంలో శనివారం రాత్రి 11 గంటలకు గద్దెరాళ్ల తండాలోని భూక్య చందునాయక్‌ ఇంటికి వచ్చారు. తమకు ఇటుకలు కావాలంటూ ఆయనతో మాట కలిపారు. కారును నిలిపిన ప్రదేశానికి తీసుకొచ్చి బలవంతంగా ఎక్కించే క్రమంలో చందునాయక్‌ తిరగబడ్డాడు. గొడవ జరగడంతో స్థానికులు చేరుకున్నారు. చందునాయక్‌ను దొంగలు కిడ్నాప్‌ చేస్తున్నారని భావించి పోలీసులపై దాడికి దిగారు. పోలీసుల వద్ద ఆయుధాలు లేకపోగా.. గుర్తింపు కార్డులు చూపించినా గుర్తించలేకపోయారు. వారి బారి నుంచి కానిస్టేబుల్‌ తప్పించుకొని.. అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బొమ్మలరామారం ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, సర్పంచి చిమ్ముల రవీందర్‌రెడ్డి స్థానిక పోలీసులకు తెలియజేయడంతో.. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన పోలీసులను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తాము పోలీసులమని, కేసు విచారణకు వచ్చామని చెబితే సహకరించేవారిమని చందూనాయక్‌, గ్రామస్థులు చెప్పారు. సాధారణంగా ఏదైనా కేసు విచారణకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పడు స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటారు. ఇక్కడ అలా జరగలేదని, బొమ్మలరామారం స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులపై దాడి ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక అందించాలని యాదాద్రి జోన్‌ పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. దారిదోపిడీ కేసులో నిందితులకు చందునాయక్‌ సహకరించాడన్న సమాచారంతో వెళ్లిన పోలీసు బృందం.. అతన్ని విచారిస్తున్న సమయంలో గ్రామ యువకులు, మహిళలు దాడి చేశారని భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి విలేకరులకు తెలిపారు. చందూనాయక్‌ సహా 13 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని