గుజరాత్‌ ప్రశ్నపత్రం.. హైదరాబాద్‌లో లీక్‌

గుజరాత్‌లో పంచాయతీ జూనియర్‌ క్లర్క్‌ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్‌లో లీక్‌ అయింది.

Updated : 30 Jan 2023 04:52 IST

ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉద్యోగి సహా 15 మంది అరెస్టు

అహ్మదాబాద్‌, ఈనాడు-హైదరాబాద్‌, జిన్నారం-న్యూస్‌టుడే: గుజరాత్‌లో పంచాయతీ జూనియర్‌ క్లర్క్‌ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్‌లో లీక్‌ అయింది. 1,181 పోస్టులకు సుమారు 9.53 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆదివారం పరీక్ష జరగాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఓ ముఠా దగ్గర ప్రశ్నపత్రం ఉందని పోలీసులు గుర్తించడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌ ఐడీఏ బొల్లారంలోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు గుర్తించారు. గుజరాత్‌ రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) పోలీసు అధికారులు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు ప్రదీప్‌ నాయక్‌, కేతన్‌ బరోట్‌, హైదరాబాద్‌లోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉద్యోగి జీత్‌ నాయక్‌, భాస్కర్‌ చౌదరి, రిద్ధి చౌదరి ఉన్నారు. వీరిలో 10 మంది గుజరాత్‌కు చెందినవారు కాగా, ప్రదీప్‌ నాయక్‌ ఒడిశా వాసి. ప్రదీప్‌ నాయక్‌ నుంచి రాబట్టిన సమాచారంతో ప్రశ్నపత్రాల లీక్‌కు కేఎల్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఆపరేటర్‌ సర్దార్కర్‌ రోహా సహకరించినట్లు నిర్ధరించుకున్నారు. గుజరాత్‌కు చెందిన కేతన్‌ బరోట్‌ అక్కడ దిశా, ఇండోక్టినేషన్‌ కన్సల్టెన్సీల పేరుతో బోగస్‌ అడ్మిషన్లు, ప్రశ్నపత్రాల లీకేజీ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు ఆదివారం 10-11 గంటల మధ్య కేఎల్‌ హైటెక్‌ సెక్యూర్‌ ప్రింటింగ్‌ లిమిటెడ్‌ సంస్థలో గోప్యంగా తనిఖీలు నిర్వహించారు. సర్దార్కర్‌ రోహాతో పాటు జీత్‌ నాయక్‌, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రాలు నగరంలో తయారవుతున్న విషయం ఎలా బయటకు పొక్కింది? ప్రధాన నిందితులతో ఆపరేటర్‌కు ఉన్న పరిచయాలు, సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగుల ప్రమేయం తదితర అంశాలపై వారు కూపీ లాగుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీ చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని