అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. ఇద్దరు విద్యార్థుల మృతి

అతివేగం కారణంగా ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయి రాళ్లపై బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం చెందారు.

Published : 31 Jan 2023 04:49 IST

పరవాడ, న్యూస్‌టుడే: అతివేగం కారణంగా ద్విచక్రవాహనం అదుపుతప్పి రహదారి పక్కనున్న పొదల్లోకి దూసుకుపోయి రాళ్లపై బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం చెందారు. మరోకరు గాయాలతో బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా పరవాడ శ్మశానవాటిక సమీపంలోని కోనాం చెరువు మలుపు వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడ మండలం భరణికం గ్రామానికి చెందిన పెదపాయి సాయికుమార్‌(13)(8వతరగతి), ద్వారపూడి పవన్‌(15)(పదో తరగతి) పరవాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. మునాసుల లోకేశ్‌(14) ఉక్కునగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. లోకేశ్‌ తన బాబాయికి చెందిన ద్విచక్రవాహనాన్ని తీసుకుని పవన్‌తో కలిసి స్వగ్రామం నుంచి పరవాడ వెళ్లేందుకు బయలుదేరాడు. పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరి.. బస్టాప్‌లో వేచి ఉన్న సాయికుమార్‌ను స్కూల్‌ వద్ద దింపుతామని ఎక్కించుకున్నారు. వాహనాన్ని పవన్‌ నడుపుతుండగా మిగతా ఇద్దరు వెనక కూర్చొన్నారు. అతివేగంతో వెళ్లిన కారణంగా కోనాం చెరువు సమీపంలోని మలుపు వద్ద వాహనం అదుపుతప్పి పొదల్లోకి దూసుకుపోయి రాళ్లపైన పడటంతో సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేశ్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో కేజీహెచ్‌కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. పవన్‌ గాయాలతో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు