కుమార్తెలను చదివించేందుకు అప్పులు.. తీర్చలేక అమ్మ బలవన్మరణం

కన్నబిడ్డలను ఉన్నతస్థానంలో చూడాలని అందరిలాగే ఆ తల్లి కూడా పరితపించారు. వారిని గొప్ప చదువులు చదివించాలని తపనపడ్డారు.

Updated : 01 Feb 2023 07:13 IST

రాయికల్‌, న్యూస్‌టుడే: కన్నబిడ్డలను ఉన్నతస్థానంలో చూడాలని అందరిలాగే ఆ తల్లి కూడా పరితపించారు. వారిని గొప్ప చదువులు చదివించాలని తపనపడ్డారు. జీవనోపాధి కోసం దుబాయి వెళ్లిన భర్త నుంచి ఆశించినంత ఆర్థిక చేయూత లభించకపోవడంతో కుమార్తెల చదువుల కోసం  అప్పులు చేశారు. వాటిని తీర్చేదారి కనిపించక చివరికి తనువు చాలించారు. 

ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అరికెల్ల లావణ్య(40) గ్రామంలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. భర్త బుచ్చయ్య దుబాయిలో పనిచేస్తున్నారు. సరైన ఉపాధి లేని కారణంగా ఎనిమిదేళ్లలో ఆయన పలుమార్లు ఊరికి వచ్చి వెళ్లారు. తన ముగ్గురు కుమార్తెలను లావణ్య చదివిస్తున్నారు. అపూర్వ, అంకితలు హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతుండగా చిన్న కుమార్తె అక్షయ కరీంనగర్‌లో పాలిటెక్నిక్‌ చదువుతోంది. ఈ క్రమంలో దాదాపు రూ.10 లక్షలకు పైగా అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం కానరాకపోవడంతో ఊరిలో ఒంటరిగా ఉంటున్న లావణ్య.. సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. ఈ మేరకు లావణ్య తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని