Nellore: మేనమామ అత్యాచారయత్నం.. 5 నెలలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక

అభం.. శుభం తెలియని చిట్టితల్లి (14) పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కబంధ హస్తాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా... బలవంతంగా ఆ చిన్నారి నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్‌ పోశాడు.

Published : 01 Feb 2023 07:46 IST

చెన్నైలో చికిత్స పొందుతూ మృతి

వెంకటాచలం, నెల్లూరు నేరవిభాగం, న్యూస్‌టుడే: అభం.. శుభం తెలియని చిట్టితల్లి (14) పాలిట మేనమామ యముడయ్యాడు. ఆ కామాంధుడి కబంధ హస్తాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా... బలవంతంగా ఆ చిన్నారి నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్‌ పోశాడు. దీంతో బాధితురాలు విలవిల్లాడిపోయింది. చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలొదిలింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడికి కుమారుడు పుట్టి, 18 ఏళ్ల వయసులో మృతి చెందాడు. తర్వాత చాలా కాలానికి బాలిక పుట్టింది. ఆమెను అల్లారుముద్దుగా పెంచారు.

గతేడాది సెప్టెంబరు 5న కుటుంబసభ్యులు నెల్లూరుకు వెళ్లగా, బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన మేనమామ వరుసయ్యే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడడంతో.. బాధితురాలు తప్పించుకొని మరుగుదొడ్డి గదిలో దాక్కుంది. అతడు వెంటాడి.. తలుపులు పగలగొట్టి.. చిన్నారి కేకలు వేయకుండా అక్కడే ఉన్న యాసిడ్‌ను నోట్లో పోశాడు. దీంతో చిన్నారి విలవిల్లాడింది. అయిదు నెలలుగా ఆమె చెన్నైలో చికిత్స పొందుతోంది. రెండు రోజుల క్రితం బాలికను పరీక్షించిన వైద్యులు.. రెండు నెలల తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేసి, ముఖాన్ని పాతస్థితికి తెస్తామని చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. కానీ, వారి కలలు ఆవిరయ్యాయి. బాధితురాలు మంగళవారం ప్రాణాలొదిలింది. ఈ విషయమై నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసు పంచనామా, దర్యాప్తు నిమిత్తం బుధవారం చెన్నైకు వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని