విచారణ పేరుతో కొడతారా?

విచారణ పేరుతో గిరిజనుడిని తీవ్రంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళనకు దిగారు.

Published : 02 Feb 2023 04:53 IST

పార్వతీపురం మన్యం జిల్లా జీఎల్‌పురంలో గిరిజనుల ఆందోళన

గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: విచారణ పేరుతో గిరిజనుడిని తీవ్రంగా కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం బైఠాయించారు. అనంతరం తహసీల్దారు రాములమ్మకు ఫిర్యాదు అందజేశారు. అందులోని వివరాల ప్రకారం... దుడ్డుఖల్లు గ్రామానికి చెందిన కొండగొర్రి కామరాజు, పార్వతి దంపతులను అదే గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనులు చేసేందుకు మూడేళ్ల కిందట వార్డెన్‌ సుబ్బారావు నియమించారు. కొంతకాలం కిందట వారు పనిమానేశారు.

జీతం బకాయి అడిగారన్న కోపంతో.. వసతిగృహం ఆవరణలో ఉన్న జనరేటర్‌ దొంగతనం చేశారంటూ కామరాజు, పార్వతిపై వార్డెన్‌ ఎల్విన్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ షన్ముఖరావు కామరాజును స్టేషన్‌కు పిలిచి సిబ్బందితో కొట్టించారు. కాళ్లు, పాదాలు, తొడలు, పొట్ట, వీపుపైన లాఠీలతో కొట్టి, బూట్లతో తన్ని విడిచిపెట్టారు. రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత కామరాజు అపస్మారక స్థితికి చేరడంతో ఆసుపత్రికి తరలించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వార్డెన్‌ సుబ్బారావు, విచారణ పేరుతో కొట్టిన ఎస్‌ఐ షన్ముఖరావు, సిబ్బందిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు స్పష్టంచేశారు. దీనిపై సీఐ సత్యనారాయణ స్పందిస్తూ.. ‘‘వార్డెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. విచారణలో భాగంగా కొట్టారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం, గిరిజనులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై దర్యాప్తు నిర్వహిస్తాం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు