సీఎం సభకు వెళ్తూ ప్రమాదానికి గురైన వృద్ధురాలి మృతి

రాజమహేంద్రవరంలో నిర్వహించిన సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లకు తీవ్రగాయాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు పార్వతి (70) గురువారం మృతిచెందారు.

Published : 03 Feb 2023 05:24 IST

కాకినాడ (మసీదు సెంటర్‌), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో నిర్వహించిన సీఎం సభకు జనాన్ని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో రెండు కాళ్లకు తీవ్రగాయాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వృద్ధురాలు పార్వతి (70) గురువారం మృతిచెందారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరానికి చెందిన ఆమె ముఖ్యమంత్రి జగన్‌ రోడ్‌షో, బహిరంగసభ రోజు ఘటన జరిగింది. గత నెల 3న రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బస్సు ఢీకొట్టింది. ఆమెపై నుంచి ముందుచక్రం వెళ్లడంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యులు రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి ఎడమ కాలును మోకాలిపై వరకు తొలగించారు.

భర్త పింఛను రద్దయిపోతుందనే భయంతో..

సీఎం సభకు వెళ్లకపోతే భర్తకు వచ్చే పింఛను రద్దయిపోతుందని వాలంటీర్లు బలవంతం చేయడంతోనే పార్వతి బయల్దేరారని అదేరోజు స్థానికులు చెప్పారు. పార్వతికి జీజీహెచ్‌ ఐసీయూలో అత్యున్నత వైద్యం అందించామని, కోలుకుంటున్న క్రమంలో మృతిచెందడం దురదృష్టకరమని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.హేమలతాదేవి తెలిపారు. సీఎం సభకు ఏర్పాటుచేసిన బస్సులో వెళ్లి దిగుతూ జారిపోతే.. మరో వాహనం వచ్చి ఢీకొట్టిన వార్త అవాస్తవమని తూర్పుగోదావరి జిల్లా పోలీసు, కలెక్టర్‌ కార్యాలయాల ప్రతినిధులు గతంలోనే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన సొంత పనిమీద రాజమహేంద్రవరం వచ్చినప్పుడే ప్రమాదం జరిగిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు