గంజాయి స్మగ్లర్ల బీభత్సం

ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొట్టి తప్పించుకున్నారు.

Published : 04 Feb 2023 05:13 IST

ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో సరకు తరలించే యత్నం
అడ్డగించిన ఆబ్కారీ, పోలీసు సిబ్బందిని ఢీకొట్టి మరీ పలాయనం
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని దొరికిపోయిన నిందితులు

ఇల్లెందు, న్యూస్‌టుడే: ముగ్గురు యువకులు కారులో గంజాయి తరలిస్తూ అడ్డువచ్చిన ఆబ్కారీ, పోలీసు అధికారులను ఢీకొట్టి తప్పించుకున్నారు. ఆ క్రమంలో వాహనాన్ని వేగంగా నడుపుతూ..జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ..చివరికి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి పోలీసులకు చిక్కారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం..మహారాష్ట్రకు చెందిన సాగర్‌దుక్కడ్‌, ఆనంద్‌ బాలాజీ మక్కాడ్‌, అమూల్‌ రాందాస్‌లు ఒడిశా రాష్ట్రంలో 350 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. సరకును కారులో సర్దుకుని, మహారాష్ట్రకు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ ఆబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది భద్రాచలంలో బ్రిడ్జి పాయింట్‌ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించారు. గమనించిన స్మగ్లర్లు వేగం తగ్గించినట్టే తగ్గించి..వెంటనే అతివేగంతో బారికేడును ఢీకొట్టి తప్పించుకున్నారు. అప్రమత్తమైన అధికారులు పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు పోలీస్‌, ఆబ్కారీ సిబ్బందికి సమాచారమిచ్చారు. పాల్వంచ, కొత్తగూడెం దాటి అతివేగంగా వస్తున్న కారును ఇల్లెందులో అడ్డగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. స్మగ్లర్లు కారును ఆపకపోగా, అదే వేగంతో ఆబ్కారీ హెడ్‌ కానిస్టేబుల్‌ బాబాను ఢీకొట్టి పట్టణంలోకి ప్రవేశించారు. ఆబ్కారీ, పోలీసులు కలిసి వెంబడించడంతో రైల్వే బ్రిడ్జి మీదుగా వాహనాన్ని మళ్లించారు. కొత్త బస్టాండు మలుపు వద్ద ఉన్న పురపాలక పారిశుద్ధ్య కార్మికులను తప్పించే క్రమంలో కారు డివైడర్‌కు తగిలి, అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ ధాటికి స్తంభం విరిగిపోవడం, కారు ఎటూ కదలకపోవడంతో అందులోని ముగ్గురు నిందితులు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న రూ.70లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, కారు ఢీకొనడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ బాబాకు స్వల్ప గాయాలయ్యాయని డీఎస్పీ వెల్లడించారు. ‘ఎవరి కంటా పడకుండా సరకు తరలించేందుకు స్మగ్లర్లు ఇన్నోవా కారులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లోపలి వ్యక్తులు కనిపించకుండా నల్ల అద్దాలు అమర్చారు. కారు నంబరును తొలగించి, ఓ ఆటో నంబరును (ఏపీ 31 బీక్యూ 1154) జోడించారు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు