స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం

స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Published : 05 Feb 2023 05:51 IST

భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఘటన

శామీర్‌పేట, న్యూస్‌టుడే: స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శామీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ వి.సుధీర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..  నిందితుడు చక్రధర్‌గౌడ్‌(36), బాధిత మహిళ భర్త సిద్దిపేటలో ఒకే కాలనీలో నివసించే వారు. కొన్నేళ్ల క్రితం ఆ కుటుంబం బతుకుతెరువు కోసం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా తూంకుంటకు వచ్చింది. ఆమె ప్రయివేట్‌ నర్సుగా పనిచేస్తోంది. చక్రధర్‌గౌడ్‌ తన మిత్రుడిని జనవరి 31 రాత్రి నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో విందుకు ఆహ్వానించాడు. అక్కడ ఇతర స్నేహితులతో కలిసి మద్యం తాగారు. బాధిత మహిళ భర్తకు వాహనం లేకపోవడంతో చక్రధర్‌గౌడ్‌ తోటి స్నేహితులతో కలిసి ఇంటి వద్ద దింపారు. వారు తిరిగి వెళుతుండగా బాధితురాలి భర్త ద్విచక్రవాహనం అల్వాల్‌లో ఉన్న విషయం తెలుసుకుని, దాన్ని తీసుకునేందుకు నిందితుడి మిత్రుడైన బన్నూ కారులో ఎక్కించారు. మీరు వెళ్లండి నేను వెనకొస్తానని నిందితుడు వారిని పంపించాడు. వారు వెళ్లిన తర్వాత చక్రధర్‌గౌడ్‌ మిత్రుడి ఇంటి తలుపు తట్టాడు. మహిళ తన భర్తే వచ్చాడని భావించి తలుపు తెరవడంతో అత్యాచారాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో చక్రధర్‌గౌడ్‌ పారిపోయాడు. భర్త వచ్చిన తరువాత జరిగిన ఘటనను వివరించినా మద్యం మత్తులో పట్టించుకోలేదు. బాధితురాలు దిగాలుగా ఉంటూ రెండు రోజుల క్రితం నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు అల్వాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితురాలు తల్లితో కలిసి శుక్రవారం రాత్రి శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు