కూర్చున్న చోటే మృతి చెందిన కూలీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని వల్లెల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి కూర్చున్న చోటే మృతి చెందాడు.

Published : 05 Feb 2023 05:00 IST

సత్తెనపల్లిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఘటన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని వల్లెల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి కూర్చున్న చోటే మృతి చెందాడు. పట్టణ సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. 30వ వార్డుకు చెందిన గంగవరపు శ్రీనివాసరావు(48) కూలీ. సుమారు 15 ఏళ్ల కిందట భార్య అతడిని విడిచి వెళ్లిపోవడంతో సోదరుడి వద్ద ఉంటున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు శనివారం ఉదయం 6.30 గంటలకు వల్లెల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. కొంత మద్యం తాగి వాంతులు చేసుకున్నాడు. అనంతరం కుర్చీలో ఉలుకూపలుకూ లేకుండా ఉండటంతో.. మృతి చెందినట్లు 8 గంటల సమయంలో గుర్తించిన బార్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారని ఎస్సై తెలిపారు. శ్రీనివాసరావు మద్యం తాగలేదని, అనారోగ్యంతోనే మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారని పేర్కొన్నారు.

బార్లకు వేళాపాళా లేదా?

బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకే నడపాలి. అలాంటిది కూలీని ఉదయం 6.30 గంటలకే లోపలికి ఎందుకు రానిచ్చారు? ఒకవేళ అతడు వేరే చోటి నుంచి మద్యం తీసుకొచ్చి ఉంటే దాన్ని అనుమతిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఇలాకాలో వేళాపాళా లేకుండా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని