సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు

సహజీవనం చేస్తున్న వివాహితను, ఆమె కుమార్తెను ఓ వ్యక్తి గునపంతో తలపై కొట్టి హత్యచేశాడు.

Updated : 05 Feb 2023 08:29 IST

ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో దారుణం

ఈనాడు డిజిటల్‌-ఏలూరు, న్యూస్‌టుడే-ముసునూరు: సహజీవనం చేస్తున్న వివాహితను, ఆమె కుమార్తెను ఓ వ్యక్తి గునపంతో తలపై కొట్టి హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామపరిధి శ్రీరామనగర్‌లో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన దేవరపల్లి రవి పదేళ్ల క్రితం భార్యకు విడాకులిచ్చారు.

శ్రీరామ్‌నగర్‌కు చెందిన సొంగా యేసుమరియమ్మ(35) పదేళ్లుగా భర్త నుంచి దూరంగా కుమార్తె అఖిలతో(15) కలిసి ఉంటున్నారు. రవి లారీ డ్రైవరుగా పనిచేసేటప్పుడు యేసుమరియమ్మతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తూ రెండేళ్లు ఏలూరులో ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్నారు. అఖిల పదోతరగతి చదువుతోంది. రవికి మద్యం తాగే అలవాటుంది. దీంతో తరచూ వారిమధ్య గొడవలు జరుగుతున్నాయి. కరెంటు బిల్లు కట్టేందుకు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగాడు. బిల్లు కట్టకపోవడంతో జనవరి 30న ఇంటికి విద్యుత్తుసరఫరా నిలిపేశారు. దీనిపై ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో యేసుమరియమ్మ కుటుంబసభ్యులు ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం రవి వారివద్దకు వెళ్లి బుద్ధిగా ఉంటానని నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక మరియమ్మను గునపంతో కణితి మీద, అఖిలను తల వెనుకభాగంలో కొట్టి చంపాడు.

తాళం వేసి పరారు

శనివారం ఉదయం మరియమ్మ తమ్ముడు గురవయ్య ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చి కిటికిలోంచి చూడగా ఇద్దరి మృతదేహాలు మంచంపై ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌గౌడ్‌, రూరల్‌ సీఐ అంకబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని