Andhra News: ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందగా.. విషయం తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన హాస్టల్‌ వార్డెన్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

Updated : 05 Feb 2023 09:22 IST

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందగా.. విషయం తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన హాస్టల్‌ వార్డెన్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషాద ఘటనలు తిరుపతి జిల్లా గూడూరులో శనివారం చోటుచేసుకున్నాయి. ఎస్సై పవన్‌కుమార్‌ కథనం మేరకు.. గూడూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో కడప జిల్లా వేముల మండలం నారేపల్లికి చెందిన వెంకటకృష్ణారెడ్డి కుమారుడు ధరణేశ్వర్‌రెడ్డి (20) ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్న భోజనం అనంతరం వసతిగృహంలో ఉరేసుకున్నాడు.

సహచర విద్యార్థులు తరగతులు పూర్తయ్యాక వసతి గృహానికి వచ్చి చూడగా ధరణేశ్వర్‌రెడ్డి ఉరేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వసతిగృహ వార్డెన్‌ బి.శ్రీనివాసులు నాయుడు (54).. కళాశాల ప్రిన్సిపల్‌, ఇతర సిబ్బందికి సమాచారమిచ్చి ఘటన స్థలంవద్దకు వెళ్లారు. అక్కడ ఆయన కుప్పకూలిపోవడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించేలోపే మృతిచెందారు. సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు నాయుడు 12 ఏళ్లుగా వార్డెన్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన గుండెజబ్బుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని