వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో

అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ ఎనుమాముల బాలాజీనగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 06 Feb 2023 07:31 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ ఎనుమాముల బాలాజీనగర్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన గంధం కుమారస్వామి(45) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత నగరపాలక సంస్థ(వరంగల్‌) ఎన్నికల సమయంలో కార్పొరేటర్‌ టికెట్‌ రాకపోవడంతో తెరాసను వీడి భాజపాలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు.

అయితే, ఎన్నికల సమయంలో ఎనుమాముల మాజీ సర్పంచి సాంబేశ్వర్‌ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నానని, ఓటమి పాలైన తనను ఓ వైపు ఆ బాధ కుంగదీస్తుంటే మరోవైపు మాజీ సర్పంచి డబ్బుల కోసం వేధించాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన చెందారు. ఆయన ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, నమ్మినవారు తనను మోసం చేశారని విలపించారు. తన భార్య, పిల్లలను వేధించవద్దంటూ లేఖ రాశారు. వీడియోను మిత్రులకు, తోటి వ్యాపారులకు పంపించి ఇంట్లో ఉరేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య మరో గదిలో ఉన్నారు. అనంతరం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తన భర్త మృతికి కారకులైన సాంబేశ్వర్‌, ఆయన భార్య ప్రమీల, మరో వ్యక్తి కోట విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి భార్య లక్ష్మి ఎనుమాముల సీఐకి ఫిర్యాదు చేశారు. కుమారస్వామి గతంలో చిన్న పరిశ్రమల విభాగంలో ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు