Crime News: మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ భార్య బలవన్మరణం

మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 08 Feb 2023 07:11 IST

భర్త, అత్త వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: మంచిర్యాల మున్సిపల్‌ కమిషనర్‌ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె బలవన్మరణానికి  పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంద్రకుమారి, రాంబాబులు ఆరోపించారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైన తర్వాతినుంచి వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారని తెలిపారు. ఇంట్లో శాడిస్ట్‌గా, సైకోగా ఉంటూ బయట మాత్రం మంచివాడిగా ప్రవర్తించేవారన్నారు. ఆ మేరకు ఫిర్యాదు చేయాలని మంచిర్యాల సీఐ నారాయణనాయక్‌ జ్యోతి కుటుంబసభ్యులకు సూచించగా తమ కుమార్తె మరణానికి కారణమైన బాలకృష్ణను తమకు అప్పగించాలని, అప్పటివరకు ఫిర్యాదు చేయబోమని గొడవకు దిగారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తెలపడంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి వారు అంగీకరించారు. పోలీసులు జ్యోతితో పాటు బాలకృష్ణల సెల్‌ఫోన్లను సీజ్‌ చేసి కాలనీవాసులతో పాటు ఇంటి పనిమనిషితో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. బాలకృష్ణ సొంత ఊరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశావపురం. జ్యోతి స్వస్థలం కొణిజర్ల మండలం సీతారామపురం. వీరికి 2014, ఆగస్టు 14న వివాహమైంది. బాలకృష్ణ తొలుత కానిస్టేబుల్‌గా నియమితులై హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ.. గ్రూప్‌- 2 ద్వారా 2020లో మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికయ్యారు. ఏడాదిన్నర క్రితం నిర్మల్‌ నుంచి మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఈ దంపతులకు రిత్విక్‌ (8), భవిష్య (6) ఉన్నారు. మంగళవారం పాఠశాల నుంచి వచ్చేసరికి తల్లి మరణించి ఉండటంతో వారు తల్లడిల్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని