గనుల యజమాని దారుణ హత్య

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె సమీపంలో కోట్ల కుటుంబానికి ముఖ్య అనుచరుడైన లద్దగిరి శ్రీనివాసులు (55) అనే గనుల యజమాని దారుణ హత్యకు గురయ్యారు.

Updated : 09 Feb 2023 05:56 IST

దారి కాచి కత్తులతో పొడిచి హతమార్చిన వైనం  
మృతుడు కోట్ల కుటుంబానికి ప్రధాన వర్గీయుడు
గనుల్లో అక్రమాలు బయటపెట్టినందుకే చంపారంటున్న కుటుంబ సభ్యులు

డోన్‌, డోన్‌ నేరవిభాగం, ప్యాపిలి, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లె సమీపంలో కోట్ల కుటుంబానికి ముఖ్య అనుచరుడైన లద్దగిరి శ్రీనివాసులు (55) అనే గనుల యజమాని దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. డోన్‌ మండలం కొచ్చెర్వుకు చెందిన శ్రీను బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దారిలో కాపుకాచిన కొందరు వ్యక్తులు బావిపల్లె సమీపంలో రోకలిబండలతో దాడి చేసి కత్తులతో పొడిచారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అటువైపుగా వస్తున్నవారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్యాపిలి సీఐ శ్రీరాములు, జలదుర్గం ఎస్సై నరేష్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. శ్రీనివాసులు (55) కొద్దికాలం క్రితం డోన్‌ నియోజకవర్గంలోని అక్రమ మైనింగ్‌పై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈ కారణంగానే ప్రత్యర్థులు హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎవరితో ప్రాణహానో చెప్పలేదంటున్న పోలీసులు

కొద్దికాలంగా ఎవరో బెదిరిస్తున్నారంటూ స్వయంగా తన తండ్రే డోన్‌ పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని మృతుడి కుమారుడు మధు వాపోయారు. ప్రాణహాని ఉందంటూ రెండు నెలల క్రితమే ఆయన ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని ఇదే విషయమై బాధితుడు ప్రశ్నించగా.. ప్రాణహాని ఉన్నట్లు చెప్పారేగానీ ఎవరిపై అనుమానం ఉందో తెలపలేదని ఆయన పేర్కొన్నారు. శ్రీనుకు గ్రామంలో కొందరితో గొడవలు, మైనింగ్‌ వ్యాపారులతో విభేదాలు ఉన్నాయని.. వాటితోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ మహిళకు సంబంధించిన వ్యవహారంపై కూడా విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి తదితరులు శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్యకు పాల్పడినవారిని, తెరవెనుక ఉన్నవారని పోలీసులు అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని