Harassment: చిట్టి ‘ఆయా’కు దంపతుల చిత్రహింసలు

పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆమె జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే చిట్టి ఆయాగా మారింది.

Updated : 09 Feb 2023 07:02 IST

పేదరికం ఆ బాలికను పాఠశాలకు బదులు పనికి వెళ్లేలా చేసింది. ఆటపాటలతో సరదాగా సాగాల్సిన ఆమె జీవితం మరో చిన్నారి బాగోగులు చూసే చిట్టి ఆయాగా మారింది. అదే పని ఆమెకు నరకం చూపించింది. హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన మనీశ్‌ ఖట్టర్‌ (36), కమల్‌జీత్‌ కౌర్‌ (34) దంపతులకు మూడున్నరేళ్ల కుమార్తె ఉంది. ఇద్దరూ ఉద్యోగులు కావడంతో అయిదు నెలల క్రితం ఓ సంస్థ ద్వారా ఝార్ఖండ్‌లోని రాంచీ నుంచి 14 ఏళ్ల బాలికను ఇంటి సహాయకురాలిగా నియమించుకున్నారు.

పనిలో చేరిన కొద్దిరోజులకే బాలికకు వేధింపులు మొదలయ్యాయి. సరిగా పని చేయడం లేదని ఆమెను కొడుతూ, వాతలు పెడుతూ, బ్లేడుతో చేతులపై కోస్తూ హింసించారు. లైంగికంగానూ వేధించారు. భోజనం కూడా పెట్టకపోవడంతో ఇంట్లో ఉండే చెత్తడబ్బాలో పడేసిన మిగులు పదార్థాలు తిని ఆ బాలిక పొట్ట నింపుకొనేది. కౌర్‌ దంపతుల చేతిలో బాలిక నరకం అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ అనే సామాజిక కార్యకర్త, సఖి కేంద్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. బుధవారం కౌర్‌ దంపతులను అరెస్టు చేసిన పోలీసులు బాలికను ఎన్జీవోకు అప్పగించారు. తీవ్రగాయాలతో ఉన్న బాలికకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు దీపికా తెలిపారు. సిటీ కోర్టు మనీశ్‌ ఖట్టర్‌కు పోలీసు రిమాండ్‌, కౌర్‌కు జుడీషియల్‌ కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని