Mancherial: క్షణికావేశం.. ప్రేమజంట విషాదాంతం!

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికీ సిద్ధమయ్యారు.. అంతలోనే క్షణికావేశంలో ఆ జంట తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది.

Updated : 20 Feb 2023 07:03 IST

పెళ్లితో ఒక్కటవ్వాల్సిన   ఇద్దరూ మృత్యుఒడికి..

హాజీపూర్‌, న్యూస్‌టుడే: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించడంతో పెళ్లికీ సిద్ధమయ్యారు.. అంతలోనే క్షణికావేశంలో ఆ జంట తీసుకున్న నిర్ణయం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. అప్పుల భారంతో అతను, అతని చర్యకు భయపడి ఆమె పురుగుల మందు తాగారు. అనంతరం ఎలాగైనా బతకాలన్న ఆశతో విఫలయత్నం చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలివి.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం దొనబండకు చెందిన నరెడ్ల సిద్ధయ్య, వసంత దంపతుల చిన్న కుమార్తె సంఘవి (21) డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్దనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నాగవెల్లి శ్రీకాంత్‌ (25)తో ప్రేమలో పడింది. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్‌.. సంఘవిని తీసుకొని ఎల్లంపల్లి జలాశయం వైపునకు ఆటోలో వెళ్లాడు. అక్కడ కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత.. అప్పులు పెరిగిపోయాయని, పెళ్లి చేసుకుంటే జీవనం కష్టంగా మారుతుందని.. వివాహం చేసుకోలేనని ఆమెకు చెప్పిన అతను తనతో తెచ్చుకున్న పురుగుమందు తాగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయానికి లోనైన ఆమె ఆ సీసా లాక్కొని తాను కూడా తాగింది. అనంతరం ఎలాగైనా ఇద్దరం బతకాలి అన్న భావనతో శ్రీకాంత్‌.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, అదే ఆటోలో ఆమెను తీసుకొని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ శనివారం రాత్రి మృతిచెందగా.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆదివారం ఉదయం సంఘవి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్‌ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని