Software Engineer: జిమ్‌కు వెళ్లి కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

హైదరాబాద్‌లో రెండు రోజుల కిందట వ్యాయామం చేస్తూ కానిస్టేబుల్‌ మృత్యు ఒడికి చేరిన ఉదంతాన్ని మరవకముందే కర్నూలు జిల్లా ఆదోనిలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Updated : 26 Feb 2023 07:25 IST

ఇటీవలే వివాహ నిశ్చితార్థం.. అంతలోనే విషాదం

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో రెండు రోజుల కిందట వ్యాయామం చేస్తూ కానిస్టేబుల్‌ మృత్యు ఒడికి చేరిన ఉదంతాన్ని మరవకముందే కర్నూలు జిల్లా ఆదోనిలోనూ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం... ఆదోని పట్టణానికి చెందిన 28 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఇంటి వద్దే ఉంటున్నారు. అతనికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వ్యాయామం చేయడానికి శనివారం ఉదయం పట్టణంలో ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రధాన రహదారిపై ఉన్న వ్యాయామశాల (జిమ్‌)కు వెళ్లారు. కొద్దిసేపటికే కళ్లు తిరగడంతో స్నేహితుడితో కలిసి బయటకు వచ్చారు. స్నేహితుడు నీళ్ల సీసా తేవడానికి వెళ్లగా యువకుడికి మూర్ఛ వచ్చింది.

స్థానికులు సపర్యలు చేయగా మెలకువ వచ్చినా... కొంతసేపటికే మళ్లీ కుప్పకూలిపోయారు. అక్కడికి చేరుకున్న స్నేహితుడు హుటాహుటిన ఆటోలో ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు యువకుడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని భోరున విలపించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. యువకుడి పేరు వెల్లడించేందుకు బాధిత కుటుంబీకులు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని