అన్ని చోట్లా ఆమే వధువు.. రెండో పెళ్లి పేరుతో నయవంచన

పెళ్లి చేసుకున్న మహిళ పుట్టింటికంటూ వెళ్లి మళ్లీ తిరిగిరాకపోతే..! ఆ మహిళే వేరే ఊళ్లో ఇంకొకరిని వివాహమాడితే! మరోచోటా ఇలాగే చేస్తే..! ఆ వైనం బయటపడకుండా ఉంటుందా? అందుకు సూత్రధారి పట్టుబడకపోతాడా? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదే జరిగింది.

Updated : 28 Feb 2023 07:22 IST

సూత్రధారిని పోలీసులకు అప్పగించిన బాధితుడు

వేములవాడ, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకున్న మహిళ పుట్టింటికంటూ వెళ్లి మళ్లీ తిరిగిరాకపోతే..! ఆ మహిళే వేరే ఊళ్లో ఇంకొకరిని వివాహమాడితే! మరోచోటా ఇలాగే చేస్తే..! ఆ వైనం బయటపడకుండా ఉంటుందా? అందుకు సూత్రధారి పట్టుబడకపోతాడా? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదే జరిగింది. మలి దశలో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనే వారినే లక్ష్యంగా చేసుకొని వారిని నయవంచన చేస్తూ రూ.లక్షలు దండుకొంటున్న వ్యక్తిని వేములవాడలో ఓ బాధితుడే పోలీసులకు అప్పగించాడు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తాటిపెల్లికి చెందిన లక్ష్మణ్‌ భార్య ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందడంతో రెండో పెళ్లి జరిపిస్తాడని తెలిసి కర్ణాటకకు చెందిన శివకుమార్‌ను సంప్రదించారు. ఆయన రూ.3 లక్షలు తీసుకొని ఓ మహిళతో 8 నెలల క్రితం వివాహం జరిపించాడు. సదరు మహిళ తల్లిగారింటికి వెళ్లొస్తానని చెప్పి కొద్ది రోజులకే వెళ్లిపోయింది. అదే మహిళకు జగిత్యాల జిల్లాలోని మరో వ్యక్తితో శివకుమార్‌ పెళ్లి చేయించాడు. మూడు నెలల తరవాత అక్కడి నుంచి మహిళ పారిపోయి మరొకరిని వివాహమాడింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతిని బోయినపల్లి మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిపించేందుకు శివకుమార్‌ సోమవారం వేములవాడకు వచ్చాడు. వివాహం చేయించేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్న బాధితుడు లక్ష్మణ్‌, అతని బంధువులు శివకుమార్‌ను పట్టుకొని నిలదీశారు. వెంటనే పోలీసులకు అప్పగించారు. బాధితుడు లక్ష్మణ్‌ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణసీఐ వెంకటేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు