Heart Attack: ఇద్దరు విద్యార్థులను కబళించిన గుండెపోటు

గుండెపోటుతో ఓ విద్యార్థి నిద్రలోనే మరణించగా, మరో విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలి, వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మృత్యువాత పడ్డాడు.

Updated : 08 Mar 2023 08:23 IST

నిద్రలో ఒకరు, కబడ్డీ ఆడుతూ మరొకరు

చిలకలూరిపేట గ్రామీణ, మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: గుండెపోటుతో ఓ విద్యార్థి నిద్రలోనే మరణించగా, మరో విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలి, వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మృత్యువాత పడ్డాడు. వీరిద్దరూ 20 ఏళ్లలోపు వయసున్న వారే కావడంతో ఆయా కుటుంబాల్లో ఈ మరణాలు అంతులేని విషాదాన్ని నింపాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఫిరోజ్‌ఖాన్‌ (17) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి చదువుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్దగా గురక పెడుతుండడంతో పక్కనే ఉన్న సోదరి ఫర్జానా భయపడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు వచ్చి మంచినీరు తాగించాలని చూసినా లోపలకు పోకపోవడంతో బాధితుడ్ని హుటాహుటిన చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా హతాశులయ్యారు. తమ కుమారుడు కష్టపడి చదువుకుంటాడని, ఎలాంటి ఒత్తిడి, అనారోగ్యం లేవని మృతుని తండ్రి వజీర్‌బాషా కన్నీటి పర్యంతమయ్యారు. ముందురోజు వరకు తమతో కలిసి తిరిగిన మిత్రుడు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు, బంధువులు ఖిన్నులయ్యారు. మెదడుకు, గుండెకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయి ఫిరోజ్‌ఖాన్‌ మృతి చెందినట్లు అతడిని పరీక్షించిన వైద్యుడు తెలిపారు.

వారం రోజులు పోరాడి..

అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ-ఫార్మసి చదువుతున్న తనూజ్‌నాయక్‌ (19) అనే విద్యార్థి ఈనెల 1వ తేదీన కళాశాల ప్రాంగణంలో కబడ్డీ ఆడుతూ సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి బాధితుడు మృతి చెందాడు. గుండెపోటు వల్లే తమ కుమారుడు మృతి చెందాడని వైద్యులు చెప్పినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఈ.అచ్చంపల్లి తండాకు చెందిన వీరి కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లింది. బాగా చదివి వృద్ధిలోకి రావాల్సిన కుమారుడు చిన్న వయసులోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని