Crime News: ప్రేమపాశం.. యమపాశం!

హైదరాబాద్‌ పాత బస్తీలో వేర్వేరు మతాలకు చెందిన యువతీయువకుడు ప్రేమించుకున్నారు. గురువారం తెల్లవారుజామున యువకుడు హత్యకు గురయ్యాడు.

Updated : 10 Mar 2023 09:00 IST

హైదరాబాద్‌లో యువకుడి హత్య
ఖమ్మం జిల్లాలో మరో ఘటన
ప్రేమికుడిపై యువతి కుటుంబ సభ్యుల దాడి.. గాయాలతో మృతి!

కామేపల్లి, ఖమ్మం గ్రామీణం, పహాడీషరీఫ్‌- న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పాత బస్తీలో వేర్వేరు మతాలకు చెందిన యువతీయువకుడు ప్రేమించుకున్నారు. గురువారం తెల్లవారుజామున యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరో ఘటనలో ఖమ్మం జిల్లాలో ఓ యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే. ఇరు కుటుంబాలూ వారి పెళ్లికి ఆమోదం తెలిపాయి. అయితే యువకుడి తల్లికి పక్షవాతం రావడం, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడంతో.. యువతి కుటుంబసభ్యులు యువకుడిని దూరం పెట్టారు. యువతి మాత్రం ప్రేమ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు ఈ నెల 3న యువకుడిపై దాడిచేసి కొట్టారు. గురువారం తెల్లవారుజామున యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, ఆయా కుటుంబాలు తెలిపిన వివరాలివీ..

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం కేస్లీ తండాకు చెందిన జడావత్‌ పూల్‌సింగ్‌, బుజ్జికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వలస వచ్చి బాలాపూర్‌ వాది ఎ ఉమర్‌ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు పవన్‌(22) ఇంటర్‌ చదివి ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉండే ఓ యువతి, పవన్‌ ప్రేమించుకున్నారు. మతాలు వేరు కావడంతో యువతి కుటుంబం వీరి ప్రేమను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు పహాడీషరీఫ్‌ ప్రాంతానికి మకాం మార్చారు. అయినా ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటంతో సమీపంలోని రాయల్‌ కాలనీలో ఉండే యువతి బాబాయ్‌ పవన్‌పై కక్ష పెంచుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మూత్ర విసర్జనకని బయటికొచ్చిన పవన్‌ను.. ఇద్దరు వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. వెంటనే పవన్‌ను తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు మహేశ్వరం డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. యువతి బాబాయి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురానికి చెందిన బొమ్మగాని బాబు-బసవమ్మ దంపతుల పెద్ద కుమారుడు వెంకటేశ్‌(24) డిగ్రీ పూర్తిచేసి ఓ కొరియర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి బంధువు, చింతకాని మండలానికి చెందిన యువతి ఖమ్మం గ్రామీణ మండలం పెద్దతండాలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 2న పండితాపురంలో నిర్వహించిన ఉత్సవాన్ని తిలకించేందుకు వెళ్లిన యువతి ఆ రాత్రి వెంకటేశ్‌ ఇంట్లోనే ఉంది. మరుసటి రోజు యువతిని వెంకటేశ్‌ కళాశాలకు తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న యువతి తండ్రి లక్ష్మయ్య, ఓ మహిళ, మరో వ్యక్తి కలిసి వెంకటేశ్‌ను ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడేసి కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టారు. దీంతో వెంకటేశ్‌ స్పృహతప్పి పడిపోగా.. సోదరుడు వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉన్న వెంకటేశ్‌ ఈ నెల 8న ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ ఘటనపై వెంకటేశ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం గ్రామీణ ఠాణా ఎస్సై రవూఫ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని