TSPSC: టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ల హ్యాకింగ్‌

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ (ప్రకటన నం.14/2022) పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్‌ గుర్తించింది.

Updated : 12 Mar 2023 07:45 IST

ప్రశ్నల సాఫ్ట్‌కాపీ వివరాలు బయటకు
నేటి టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష వాయిదా
15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష కూడా..

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ (ప్రకటన నం.14/2022) పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం తస్కరణకు గురైనట్లు కమిషన్‌ గుర్తించింది. దీంతో ఈ నెల 12న (ఆదివారం) నిర్వహించాల్సిన సదరు రాత పరీక్షను వాయిదా వేసినట్లు శనివారం ప్రకటించింది. పరీక్ష వాయిదాపై అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (ప్రకటన నం.23/2023) రాత పరీక్షను సైతం వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. టౌన్‌ప్లానింగ్‌ పోస్టులకు ఈ నెల 12న ఓఎంఆర్‌ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు ముద్రించి, పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు (శనివారం) టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ల నుంచి సమాచారం హ్యాక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై అత్యవసర సమావేశం నిర్వహించిన కమిషన్‌.. టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల నుంచి పరీక్షకు సంబంధించిన సాఫ్ట్‌ కాపీ సమాచారం హ్యాకింగ్‌కు గురైందని, ప్రశ్నల వివరాలు అభ్యర్థులకు చేరలేదని అభిప్రాయం వ్యక్తంచేసింది.

రంగంలోకి పోలీసులు!

వాస్తవానికి టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్య సమాచారం లీకైందన్న విషయాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కమిషన్‌ కార్యాలయానికి వచ్చి.. కంప్యూటర్లు హ్యాకింగ్‌ అయినట్లు సమాచారం ఉందని, ఒకసారి లాగిన్‌ వివరాలు చూసుకోవాలని సూచించారు. దీంతో కమిషన్‌ అధికారులు పరిశీలించి.. అత్యంత రహస్య సమాచారం ఉన్న కంప్యూటర్లను ఇతరులు తెరిచినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో టీఎస్‌పీఎస్సీ అధికారులు బేగంబజార్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అత్యంత రహస్యమైన సమాచారం లీకైనట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

అదుపులోకి ఇద్దరు..

సాధారణంగా కమిషన్‌లో అత్యంత రహస్య సమాచారం కీలకమైన హోదాల్లో ఉన్నవారి వద్ద ఉంటుంది. వారి లాగిన్‌ వివరాలతో ఎవరు కంప్యూటర్లను తెరిచారు? అందులో ఏ సమాచారం చూశారు? అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. కమిషన్‌ సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు