Crime News: ప్రాణాంతకమైన యువతుల ప్రేమ

ఇద్దరు యువతుల స్నేహం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లి.. చివరకు హత్యకు దారితీసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసింది.

Updated : 17 Mar 2023 07:00 IST

స్నేహితురాలిని హత్య చేసిన యువతి
మంచిర్యాల జిల్లాలో ఘటన

మందమర్రి నేరవిభాగం, మందమర్రి పట్టణం, న్యూస్‌టుడే: ఇద్దరు యువతుల స్నేహం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లి.. చివరకు హత్యకు దారితీసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి (21) నెన్నెల మండలం మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్‌ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట మంచిర్యాలలో అద్దెకు గది తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్‌తో పాటు అంజలి కలిసి ఉంటున్నారు. అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తుండగా, మహేశ్వరి ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసి ఇటీవల మానేసింది. మన్నెగూడం వీఆర్‌ఏ మొండి అయిదుగురు ఆడపిల్లల్లో నాలుగో కుమార్తె మహేశ్వరి. గత పదేళ్లుగా ఆమె వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

కొన్ని రోజులుగా దూరం..

మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో మహేశ్వరికి పరిచయమైంది. తర్వాత ఆమె చెల్లెలు, సోదరుడు, అంజలితోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా అంజలి శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. బుధవారం విధులు ముగించుకున్న అంజలి రాత్రి 8.15 గంటలకు గదికి వెళ్లింది. 10 గంటల వేళ మామిడిగట్టుకు వెళ్దామంటూ.. మహేశ్వరి ద్విచక్ర వాహనంపై అంజలిని వెంటబెట్టుకుని బయలుదేరింది. రాత్రి 11.30 గంటలకు శ్రీనివాస్‌కు మహేశ్వరి ఫోన్‌ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని, తాను కూడా చేసుకుంటున్నానని చెప్పడంతో ఆయన వెంటనే పరమేశ్వరితో కలిసి కారులో గుడిపల్లి గ్రామ శివారులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడిన మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అంజలి మృతి చెందింది. ఆమె మెడపై లోతైన గాయం ఉండడంతో మహేశ్వరి ఆమెను హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్వరి పొట్ట, మెడపై చిన్నపాటి కత్తిగాట్లు ఉండడంతో.. ఆత్మహత్యాయత్నం పేరిట ఆమె నమ్మించేందుకు ప్రయత్నించిందని భావిస్తున్నారు. అంజలి మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళనకు దిగారు. రామకృష్ణాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరి, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని