ఐస్‌క్రీం కావాలంటూ అర్ధరాత్రి హల్‌చల్‌.. పార్లర్‌ సిబ్బందిపై యువకుల దాడి

ఓ భారాస నాయకుడి కుమారుడితోపాటు ఆయన స్నేహితులు మద్యం మత్తులో శుక్రవారం అర్ధరాత్రి ఐస్‌క్రీం కోసం హల్‌చల్‌ చేశారు.

Updated : 19 Mar 2023 03:48 IST

తప్పించుకునే క్రమంలో భారాస నేత కుమారుడికి గాయాలు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓ భారాస నాయకుడి కుమారుడితోపాటు ఆయన స్నేహితులు మద్యం మత్తులో శుక్రవారం అర్ధరాత్రి ఐస్‌క్రీం కోసం హల్‌చల్‌ చేశారు. ఐస్‌ క్రీం పార్లర్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఎదురుదాడిని తప్పించుకునే క్రమంలో భారాస నేత కుమారుడు గాయపడ్డాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా భారాస అధ్యక్షుడు సంపత్‌రెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి గండిమైసమ్మ ప్రాంతంలోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. ఆయనతోపాటు అదే కళాశాలలో చదువుతున్న భరత్‌రెడ్డి స్నేహితులు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. రాత్రి 1 గంట తరవాత వారు బంజారాహిల్స్‌లోని ఓ ఐస్‌ క్రీం పార్లర్‌కు వెళ్లి ఐస్‌ క్రీం కావాలంటూ దుకాణం షట్టర్‌ తలుపుతట్టారు. సమయం ముగిసిందని అందులో ఉన్న షోయబ్‌, చందు, వెంకటేశ్‌ చెప్పినా.. వినిపించుకోకుండా బలవంతంగా షట్టర్‌ తెరిచి లోనికి వెళ్లారు. ఐక్‌ క్రీం ఎందుకు ఇవ్వరంటూ భరత్‌రెడ్డితోపాటు అతని స్నేహితులు దుకాణంలోని ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బయటికి వెళ్లి మరికొందరితో తిరిగి వచ్చి చందు, షోయబ్‌, వెంకటేశ్‌లపై దాడికి దిగారు. ఆ ముగ్గురు వారి చేతుల్లోని కర్రలు లాక్కొని ఎదురుదాడికి పాల్పడటంతో తప్పించుకొని వెళ్లారు. ఈ క్రమంలో కిందపడటంతో భరత్‌రెడ్డి తలకు తీవ్రగాయమైంది. స్నేహితులు అతడిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకొని భరత్‌రెడ్డి స్నేహితులను మందలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు బృందాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని