వృద్ధ దంపతుల విషాదాంతం.. ప్రాణాలను బలిగొన్న విద్యుత్తు తీగ

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్న వృద్ధ దంపతులను విద్యుదాఘాతం బలిగొన్న విషాద సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనంలో శనివారం రాత్రి వెలుగుచూసింది.

Published : 19 Mar 2023 03:07 IST

చింతకాని, న్యూస్‌టుడే: కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్న వృద్ధ దంపతులను విద్యుదాఘాతం బలిగొన్న విషాద సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనంలో శనివారం రాత్రి వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బానోత్‌ రాములు(70), బానోత్‌ రంగమ్మ(65)లు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అందరికీ వివాహాలు చేశారు. జీవనాధారం కోసం దంపతులు గొర్రెలను పెంచుతున్నారు. రోజుమాదిరిగానే శనివారం జీవాలను మధ్యాహ్న సమయం వరకు రహదారి వెంట మేపారు. తర్వాత ఓ రైతుకు చెందిన సుబాబుల్‌ పొలంలో మేపేందుకు వెళ్లారు. రాత్రి అయినా దంపతులిద్దరూ ఇంటికి చేరకపోవటంతో వారి బంధువులు పొలాల్లో వెతికారు. సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో పరిశీలించగా సుబాబుల్‌ తోటలో ఇద్దరూ పడిపోయి ఉన్నట్లు గమనించారు. వెంటనే అటువైపు వ్యవసాయ విద్యుత్తు సరఫరాను ఆపించారు. పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం వీచిన గాలిదుమారానికి విద్యుత్తు తీగ తెగి నేలపై పడింది. దాన్ని గమనించకపోవడంతోనే అటుగా వెళ్లిన దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు నాలుగు జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. నిత్యం జంటగా కనిపించే దంపతులు మృత్యువులోనూ జంటగానే వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు