ఎన్టీటీపీఎస్‌లో లిఫ్ట్‌ ప్రమాదం

ఎత్తు నుంచి లిఫ్ట్‌ ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలోని నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎన్టీటీపీఎస్‌)లో శనివారం చోటుచేసుకొంది.

Published : 19 Mar 2023 05:20 IST

ఇద్దరు ఝార్ఖండ్‌ కార్మికుల దుర్మరణం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఎత్తు నుంచి లిఫ్ట్‌ ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలోని నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎన్టీటీపీఎస్‌)లో శనివారం చోటుచేసుకొంది. ఎన్టీటీపీఎస్‌ అయిదో దశలో భాగంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నూతన ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో ఝార్ఖండ్‌కు చెందిన కార్మికులు కొన్ని రోజులుగా పాలు పంచుకుంటున్నారు. బీజీఆర్‌, పవర్‌ మ్యాక్ట్‌ నిర్మాణ కంపెనీల ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. నూతన ప్లాంట్‌లో ఉత్పాదనను మరో నెలలో ప్రారంభించనున్న నేపథ్యంలో కన్వేయర్‌ బెల్ట్‌ పరిసరాల్లో పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో 70 మీటర్ల ఎత్తున పనులు చేయడానికి కార్మికులు 310 టన్నుల సామర్థ్యం కలిగిన లిఫ్టు ఎక్కారు. అది కొంతదూరం పైకి వెళ్లి ఆగి, తిరిగి కిందికి వచ్చింది. లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోకపోవడంతో తాళాలతో కార్మికులు కొంత తెరిచారు. ఆ సమయంలో అందులో ఉన్న 20 మంది కార్మికుల్లో 18 మంది బయటకు వచ్చారు. మరో ఇద్దరు రావడానికి యత్నిస్తుండగా హఠాత్తుగా లిఫ్ట్‌ డోర్‌ మూసుకొని కొంత పైకి వెళ్లింది. తిరిగి అక్కడి నుంచి పెద్ద శబ్దం చేసుకుంటూ వేగంగా కిందకు పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు కార్మికులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. వారిని జితేంద్రసింగ్‌(23), చోటూ సింగ్‌(22)గా ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం పేర్కొంది. లిఫ్టును నిర్దేశించే లిమిట్‌ స్విచ్‌లో గత వారంలో సమస్య వచ్చినట్లు గుర్తించి అధికారులకు తెలిపినా.. మరమ్మతులకు నోచుకోలేదని పలువురు కార్మికులు, ఉద్యోగులు ఆరోపించారు. ప్రమాద కారణాన్ని కమిటీ ద్వారా గుర్తిస్తామని ఫ్యాక్టరీ మేనేజర్‌ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు