Andhra News: ఇసుక వ్యాపారి ఆత్మహత్య

అప్పు చేయకపోయినా.. పెట్టుబడి పెట్టినవారికి సమాధానం చెప్పలేక.. ఇసుక వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి తనువు చాలించారు. కోట్ల రూపాయలకు బదులు చెప్పలేక.. తిరిగి సంపాదించే మార్గం తెలియక ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 20 Mar 2023 08:09 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: అప్పు చేయకపోయినా.. పెట్టుబడి పెట్టినవారికి సమాధానం చెప్పలేక.. ఇసుక వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యక్తి తనువు చాలించారు. కోట్ల రూపాయలకు బదులు చెప్పలేక.. తిరిగి సంపాదించే మార్గం తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కళ్లేపల్లి ప్రేమ్‌రాజు(40) జేపీ పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఉపగుత్తేదారు టర్న్‌కీ వద్ద జిల్లా ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆదివారం ఉదయం 8.30 సమయంలో ద్విచక్ర వాహనంపై కొవ్వూరు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్‌స్టేషన్‌ ఎస్సై జి.శ్రీహరి, కొవ్వూరు సీఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశామని రైల్వే ఎస్సై చెప్పారు. ప్రేమ్‌రాజుకు పెళ్లి కాలేదు.

కొవ్వూరు పోలీసుల అత్యుత్సాహం..

విషయం తెలిసి తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరి సిబ్బందితో రాగా అదే సమయానికి కొవ్వూరు సీఐ రవికుమార్‌, ఎస్సై భూషణం అక్కడికి చేరుకున్నారు. ఎవరినీ మృతదేహం వద్దకు రానీయలేదు. సాధారణంగా రైల్వేస్టేషన్లో, పట్టాలపై ఎవరైనా చనిపోతే తమ పరిధి కాదనే పోలీసులు ఈ కేసులో అత్యుత్సాహం చూపించారన్న విమర్శలొచ్చాయి.

ఆ నిర్ణయమే కారణమా..

బీటెక్‌ చదివిన ప్రేమ్‌రాజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఏర్పడింది. దీంతో జేపీ పవర్‌ వెంచర్స్‌ ప్రైవేటు సంస్థలో పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జి (మేనేజరు)గా బాధ్యతలు చేపట్టారు. ఉపగుత్తేదారు సంస్థను కొంతకాలం కిందట తప్పించడంతో ఇసుక వ్యాపారాన్ని రూ.25 కోట్లు డిపాజిట్‌గా కట్టి ప్రేమ్‌రాజు తీసుకున్నట్లు తెలిసింది. ప్రతి నెలా రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉండగా, అంతమేరకు వ్యాపారం జరగక మూడు నెలలుగా బకాయి పడినట్లు సమాచారం. దీంతో ప్రేమ్‌రాజును తొలగించి ఆ బాధ్యతలు ఇతరులకు ఇచ్చారని తెలిసింది. ఈ వ్యాపారంలో అతనితో కలసి పెట్టుబడి పెట్టినవారు, స్నేహితులకు సమాధానం చెప్పలేక ప్రేమ్‌రాజు సతమతమయ్యారని తెలుస్తోంది. పెద్దలను కలసి మళ్లీ ఇసుక బాధ్యతలు ఇవ్వాలని ఇటీవల ప్రాధేయపడ్డారని తెలుస్తోంది.

ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పాడు: స్నేహితుడు గౌతమ్‌

ప్రేమ్‌రాజు బీటెక్‌ చదువుతున్నప్పుడు విశాఖకు చెందిన సాగిరాజు గౌతమ్‌ పరిచయమయ్యారు. కొవ్వూరు రావాలని ప్రేమ్‌ కోరడంతో రెండ్రోజుల క్రితం గౌతమ్‌ వచ్చారు. ఆదివారం ప్రేమ్‌రాజ్‌ ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న బల్లపై శనివారం నాలుగు గంటలు కూర్చుని మాట్లాడుకున్నారు. రాత్రి ఇద్దరూ ఒకేచోట పడుకున్నారు. ఉదయం 9 గంటలకు లేచిన గౌతమ్‌కు.. ప్రేమ్‌ కనిపించలేదు. తాను వాకింగ్‌కు వెళుతున్నానని, 9.30కు వస్తానని ఫోనులో మెసేజ్‌ ఉంది. స్టేషన్‌ వద్ద చూడగా వాహనం కనిపించినా ప్రేమ్‌ కనిపించలేదు. చివరికి రైలు పట్టాలపై చనిపోయి ఉన్నట్లు తెలిసింది. దీంతో కన్నీరుమున్నీరైన గౌతమ్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ‘ప్రేమ్‌రాజు 20 రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. మూడురోజుల క్రితం ఫోన్‌చేసి రమ్మన్నాడు.            నిన్న మధ్యాహ్నం కొవ్వూరు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి మాట్లాడాడు. ఇసుక వ్యాపారంలో మోసం చేశారని, రూ.కోట్లు రావాల్సి ఉందని చెప్పాడు. డబ్బులు ఇవ్వాల్సినవారి పేర్లు చెప్పి రాసుకోమని చెప్పాడు. ఆయనకు రూ.16 కోట్లు రావాల్సి ఉంది. ఒత్తిళ్ల   వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో కొందరు ఉన్నారు. ఎవరనేది తేలాలి’ అని గౌతమ్‌ పేర్కొన్నారు.

వ్యాపార లావాదేవీలేవీ చెప్పలేదు: తండ్రి

ప్రేమ్‌రాజు వద్ద స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను చూపించి పిన్‌ మీకు తెలుసా, ఆత్మహత్య ఎలా జరిగింది, కారణాలు ఏంటని ప్రేమ్‌రాజు తండ్రి వెంకట రామరాజును రైల్వే ఎస్సై శ్రీహరి అడిగారు. వ్యాపార లావాదేవీలు తనకు ఎప్పుడూ చెప్పలేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్‌లో ఏముందో, ఎవరితో మాట్లాడాడో తమకు తెలియదన్నారు. ప్రేమ్‌రాజు సోదరి, సోదరుడు ఇద్దరూ అమెరికాలో స్థిరపడగా తల్లి అదృష్ట రాజకుమారి కొంతకాలం క్రితం మరణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు