Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!

చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి.

Updated : 21 Mar 2023 10:43 IST

ఇటీవల ధర్మవరంలో వెలుగుచూసిన నకిలీ నోటు

ధర్మవరం, న్యూస్‌టుడే : చేనేతపురిగా పేరున్న ధర్మవరంలో దొంగనోట్ల చలామణి సాగుతోంది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు బయటపడుతున్నాయి. పదేళ్ల కిందట నకిలీ నోట్లతో లావాదేవీలు ఎక్కువగా జరిగేవి. నోట్ల రద్దు అనంతరం కొన్నేళ్ల పాటు తగ్గినా ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. దందాతో చిరువ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వెళ్లిన సమయంలో వెలుగుచూస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఆయా నోట్లపై పెన్నుతో మార్కింగ్‌ వేసి ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో చించి పడేస్తున్నారు. సామాన్యులు ఏది అసలో, ఏది నకిలీనో తెలుసుకోలేక మోసపోతున్నారు.

ధర్మవరంలో మూడు నెలలుగా దొంగ నోట్ల మార్పిడి ఊపందుకుంది. రూ.500కు చిల్లర ఇవ్వాలంటేనే ధర్మవరంలో నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఈప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. దీంతో నకిలీ నోట్లు ఎవరు ఇచ్చారో చెప్పలేని పరిస్థితి తలెత్తుతోంది. మోసపోయినవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా జంకుతున్నారు. బాధితులంతా ఎక్కువగా శాతం చిరువ్యాపారులు, కార్మికులే. పెద్ద వ్యాపారుల వద్ద లెక్కింపు యంత్రాలు ఉండటంతో సులువుగా దొంగనోట్లను గుర్తిస్తున్నారు.

40 శాతం కమీషన్‌..!

తాడిమర్రి మండలానికి చెందిన ఓ వ్యక్తిని ఇటీవల బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దొంగ నోట్ల డొంక కదిలింది. కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన వారు నోట్లు చలామణి చేస్తున్నట్లు కర్ణాటక పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కడప, బెంగళూరు, ప్రాంతాల నుంచి ధర్మవరానికి నోట్లు తీసుకొచ్చి.. కొందరు దళారులను ఏర్పాటు చేసుకొని తమ పనిని అత్యంత సులువుగా కానిచ్చేస్తున్నారు. దళారులకు 40 శాతం మేర కమీషన్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.


నిఘా పెంచుతాం..
- హుస్సేన్‌పీరా, ఇన్‌ఛార్జి డీఎస్పీ, ధర్మవరం

నకిలీనోట్ల చలామణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి కట్టడి చేస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని